Best Car Insurance Add on Covers : లక్షలాది రూపాయలు పోసి కారు కొనుగోలు చేస్తారు. దానికి పూర్తిస్థాయిలో బీమా చేయించే విషయంలో మాత్రం చాలా మంది లైట్ తీసుకుంటారు. ఇండియాలో ఏ మోటారు వాహనానికైనా థర్డ్ పార్టీ బీమా(Third Party Insurance) తప్పనిసరని అందరికీ తెలిసిందే. కానీ.. ఈ బీమా.. కారుకు జరిగే నష్టాలను మాత్రమే ఆర్థికంగా కవర్ చేస్తుంది.
ఇప్పుడు మేము చెప్పబోయే ఈ 7 ముఖ్యమైన యాడ్-ఆన్‌లు తోడయితే.. కారు యజమానికి కూడా మరింత ఆర్థిక రక్షణ దొరుకుతుంది. రూ.7,000-రూ.12,000 విలువైన ఈ కారు ఇన్సూరెన్స్ యాడ్-ఆన్‌లు తీసుకోవడం ద్వారా.. వర్షకాలంలో జరిగే 2 నుంచి 4 లక్షల రూపాయల నష్టాల నుంచి కూడా కారు(Car) యజమాని బయటపడవచ్చు. ఇంతకీ ఆ 7 ముఖ్యమైన యాడ్-ఆన్‌లు ఏంటి? వాటి వల్ల పొందే లాభాలేంటి? అన్నది ఇప్పుడు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
Zero Depreciation Cover(జీరో-డిప్రిసియేషన్ కవర్) : కారు విలువ ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఎప్పటికప్పుడు తగ్గుతూ ఉంటుంది. మీ కారుకు బీమా ఉన్నప్పటికీ తగ్గుదల వలన అయ్యే ఖర్చులను మీరు సొంతంగా చెల్లించాలి. కానీ, ఈ జీరో డిప్రిసియేషన్ కవర్ యాడ్ ఆన్ ఉన్నప్పుడు మీ కారు భాగాలు ప్రమాదాలలో దెబ్బతిన్నట్లయితే లేదా నీటిలో మునిగిపోయినట్లయితే, కారు భాగాలను మార్చడానికి అయ్యే పూర్తి ఖర్చును క్లెయిం చేయొచ్చు. ఈ యాడ్-ఆన్ ద్వారా వాహన భాగాలకు నష్టం వాటిల్లినప్పుడు పూర్తి రక్షణ ఉంటుంది. దీనికి గానూ బీమా సంస్థ రిపేర్ క్లెయిం సందర్భంలో రూ.80,000 వరకు చెల్లిస్తుంది. అదే ఈ యాడ్-ఆన్ లేకపోతే సమగ్ర బీమాలో రూ.40,000 వరకు మాత్రమే రిపేర్ క్లెయిం అందుతుంది.
Roadside Assistance Cover(రోడ్ సైడ్ అసిస్టెన్స్ కవర్) : వర్షాకాలంలో వాహన బ్రేక్‌డౌన్‌లు అధికంగా జరుగుతుంటాయి. ఆగకుండా వర్షాలు కురుస్తున్న సమయంలో వాహనం స్టార్ట్ కాకపోవడం, రోడ్డుపై వాహన టైర్ పగిలిపోయిన సందర్భంలో సహాయం పొందడానికి ఈ 24X7 రోడ్ సైడ్ అసిస్టెన్స్ యాడ్-ఆన్‌ను తీసుకోవచ్చు. దీనిలో టోయింగ్, బ్యాటరీ జంప్-స్టార్ట్, టైర్‌లను బిగించడం, తదుపరి ప్రయాణానికి అద్దె వాహనాన్ని అందించడం, ముఖ్యమైన వారికి సమాచారాన్ని తెలిపే సేవలుంటాయి. అలాగే ఈ కవరేజ్ రోడ్డు మార్గంలో ఎక్కువ దూరం ప్రయాణించే వారికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. దీనిని తీసుకోవడం వల్ల రూ.1,000 నుంచి రూ.2,000 వరకు ఆదా అవుతుంది.
Consumables Cover(కన్జూమబుల్స్(వినియోగ)కవర్) : సాధారణంగా ఓన్ డ్యామేజ్ పాలసీ.. ఆయిల్, నట్స్, బోల్ట్స్, ఏసీ, రిఫ్రిజరెంట్, రేడియేటర్ కూలెంట్ మొదలైన వినియోగ వస్తువుల ఖర్చులను కవర్ చేయదు. కానీ, ఎప్పుడైనా కారుకు నష్టం జరిగినప్పుడు ఇలాంటి ఖర్చులు సాధారణంగా ఉంటాయి. అదే ఈ యాడ్-ఆన్ కవర్‌ను తీసుకోవడం వల్ల అలాంటి వాటిని ఆదా చేసుకోవచ్చు.
తక్కువ ప్రీమియంతో కార్ ఇన్సూరెన్స్.. మహిళా డ్రైవర్లైతే ఈ యాడ్-ఆన్స్ మస్ట్!
No-Claim Bonus Protection Cover(నో-క్లెయిమ్ బోనస్ ప్రొటెక్షన్ కవర్) : ఈ యాడ్-ఆన్ కవర్ కారు ఇన్సూరెన్స్ పాలసీ వ్యవధిలో తమ మొత్తం పదవీకాలంలో ఒక్క క్లెయిమ్‌ను కూడా దాఖలు చేయని పాలసీదారులకు ఆఫర్ చేయబడుతుంది. మీరు ఎటువంటి క్లెయిమ్‌లు దాఖలు చేయనట్లయితే దీని ద్వారా ఐదేళ్లపాటు జమ చేసుకోవచ్చు. అలాగే బీమా ప్రీమియం మొత్తంపై ఇది మీకు ఆకర్షణీయమైన తగ్గింపును అందిస్తుంది. అయితే, మీరు చిన్న దావా వేసినప్పటికీ మీరు అన్నింటినీ కోల్పోవచ్చు. అందువల్ల, NCB ప్రయోజనాన్ని అలాగే ఉంచడానికి క్లెయిమ్ చేయడానికి బదులుగా మీ జేబులో నుంచి చిన్న నష్టాలకు డబ్బులు చెల్లించమని నిపుణులు సలహా ఇస్తారు.
Engine Protection Cover(ఇంజిన్ ప్రొటెక్షన్ కవర్) : వరదలు వచ్చినప్పుడు కారు ఇంజిన్, ఎలక్ట్రికల్ సిస్టమ్స్, లోపలి భాగాలకు విస్తృతమైన హాని కలుగుతుంది. ఇంజిన్‌లోకి నీరు చేరడం వల్ల పాడైపోతే దాన్ని రిపేర్ చేయడానికి అయ్యే ఖర్చును ఈ యాడ్-ఆన్ కవర్ చేస్తుంది. అయితే, కారు ఆగిపోయిన సందర్భంలో దాన్ని బలవంతంగా స్టార్ట్ చేయకూడదు. అలా చేయడం ద్వారా ఇంజిన్‌లో నీరు చేరితే దాన్ని నిర్లక్ష్యంగా పరిగణిస్తారు. వర్షాకాలంలో దీని ప్రభావానికి గురయ్యేవారు దీనిని కొనుగోలు చేయడం మంచిది. క్లెయిం చేసిన సందర్భంలో బీమా సంస్థ ఇంజిన్ భాగాలను మార్చినప్పుడు రూ.2 లక్షలు, పూర్తి ఇంజిన్‌ను రీప్లేస్ చేసినప్పుడు రూ.4 లక్షల వరకు ఖర్చులను చెల్లిస్తుంది.
Tyre Protection Cover(టైర్ ప్రొటెక్షన్ కవర్) : టైర్‌లు ఇంజిన్‌తో సమానంగా అవసరం. ఎందుకంటే అవి మీరు కారు నడిపేదాన్ని బట్టి అరిగిపోతాయి. అయితే ఈ యాడ్-ఆన్ ఫీచర్‌ని ఎంచుకోవడం ద్వారా టైర్‌లకు ఏవైనా నష్టాలు ఏర్పడితే కవర్ చేయబడుతుంది. అలాగే దీనిని తీసుకోవడం ద్వారా టైర్ పగిలిపోయే వరకు ఏదైనా నష్టం జరగకుండా రక్షణ కల్పిస్తోంది. లేబర్ ఛార్జీలు, రీప్లేస్‌మెంట్ ఖర్చును కూడా పరిగణనలోకి తీసుకుంటుంది.
Return to Invoice Cover(రిటర్న్ టు ఇన్‌వాయిస్ కవర్) : సాధారణంగా కారు పాతది అయినప్పుడు దాని విలువ తగ్గుతుంది. దీంతో ప్రతీ సంవత్సరం దాని ‘ఐడీవీ’ కూడా తగ్గుతుంది. సమగ్ర బీమాలో బీమా తీసుకునేటప్పుడు మీ వాహన విలువ ‘ఐడీవీ’ ఎంతకు సెట్ చేసారో అంతే మొత్తానికి పూర్తి క్లెయిం లభిస్తుంది. అదే 'రిటర్న్ టు ఇన్‌వాయిస్' యాడ్-ఆన్ కవర్ ఉన్నప్పుడు కారుకు పూర్తి నష్టం జరిగిన సందర్భంలో కొనుగోలు సమయంలో వాహన విలువ ఎంతో, అంతే మొత్తాన్ని భర్తీ చేస్తుంది.
Online Car Insurance : ఆన్లైన్లో కార్ ఇన్సూరెన్స్ తీసుకుంటే ఇన్ని లాభాలా!