Credit Card Limit Increase : క్రెడిట్ కార్డు వాడుతున్నారా? కార్డు పరిమితిని పెంచుతామని కార్డు జారీ సంస్థ నుంచి కాల్స్ వస్తున్నాయా? ఈ ఆఫర్ అంగీకరించాలా వద్దా అని ఆలోచిస్తున్నారా? అయితే ఇది మీ కోసమే. కొత్తగా క్రెడిట్ కార్డు తీసుకున్న వారికి బ్యాంకులు తక్కువ క్రెడిట్ పరిమితితో కార్డును మంజూరు చేస్తాయి. కార్డు తీసుకున్న వ్యక్తి చెల్లింపుల ప్రవర్తన, ఆదాయ వృద్ధి వంటి వాటిని పరిగణనలోకి తీసుకుని క్రెడిట్ లిమిట్‌ను పెంచుతుంటాయి. క్రెడిట్ లిమిట్‌ను పెంచేందుకు కార్డు జారీ సంస్థలు ముందుకొచ్చినా అధికంగా ఖర్చు చేస్తామనో అప్పుల ఉచ్చులో చిక్కుకుంటామన్న భయంతోనో చాలా మంది ఈ ఆఫర్‌ను తిరస్కరిస్తుంటారు. మరి క్రెడిట్ కార్డు పరిమితి పెంపు విషయంలో వినియోగదారుని భయాలు నిజమేనా? లిమిట్ పెంచడం వల్ల లాభమా? నష్టమా?
క్రెడిట్ కార్డు లిమిట్ పెంచుకోవడం వల్ల లాభాలు..
క్రెడిట్ స్కోరు పెంచుకోవచ్చు: క్రెడిట్ స్కోరు లెక్కించేటప్పుడు క్రెడిట్ బ్యూరో సంస్థలు పరిగణనలోకి తీసుకునే ముఖ్యమైన అంశాల్లో రుణ వినియోగ నిష్పత్తి (క్రెడిట్ యుటిలైజేషన్ రేషియో..సీయూఆర్) కూడా ఒకటి. క్రెడిట్ కార్డుదారునికి అనుమితించిన పరిమితిలో ఎంత మొత్తం వినియోగించారో సీయూఆర్ తెలియజేస్తుంది. సీయూఆర్ 30 శాతం స్థాయిని మించిందంటే మీ ఖర్చులు పరిమితిని మించుతున్నాయని అర్థం. తరచూ ఇదే విధంగా జరుగుతుంటే రుణ ఎగవేతలకు అవకాశం పెరుగుతుందని భావించి క్రెడిట్ బ్యూరోలు క్రెడిట్ స్కోరు తగ్గిస్తాయి.
క్రెడిట్ స్కోరు మెరుగుపర్చుకునేందుకు సీయూఆర్ 30 శాతంలోపు ఉండడం అవసరం. ఒకవేళ మీ రుణ వినియోగ నిష్పత్తి తరచూ 30 శాతం దాటుతుంటే మీరు క్రెడిట్ లిమిట్‌ను పెంచుకోవడం మంచిది. ఇప్పటికే మీ కార్డు జారీ సంస్థ మీకు క్రెడిట్ కార్డు పరిమితి పెంపు ఆఫర్‌ను ఇచ్చినట్లయితే దాన్ని అంగీకరించడం మంచిది. లేదా కొత్త క్రెడిట్ కార్డును తీసుకోవచ్చు.
ఉదాహరణకు మీ క్రెడిట్ కార్డు లిమిట్ లక్ష రూపాయలనుకుందాం. మీరు ప్రతి నెలా క్రెడిట్ కార్డును ఉపయోగించి రూ.45 వేలు ఖర్చుచేస్తుంటే.. అప్పుడు మీ సీయూఆర్ 45 శాతం అవుతుంది. ఇప్పుడు మీ క్రెడిట్ కార్డు పరిమితి రూ.1.50 లక్షలకు పెంచితే సీయూఆర్ 30 శాతానికి తగ్గుతుంది. అదనపు లిమిట్ రూ. 50 వేలు అందుబాటులోకి రావడం వల్ల సీయూఆర్ 30 శాతంగా ఉంటుంది. ఇది మీ క్రెడిట్ స్కోరుపై చెడు ప్రభావం చూపించదు.
ఆర్థిక ఇబ్బందుల్లో..: క్రెడిట్ కార్డు పరిమితి పెంచుకోవడం వల్ల అదనపు మొత్తం మీకు అత్యవసర నిధిగా ఉపయోగపడుతుంది. ఉద్యోగం కోల్పోవడం, అనారోగ్యం వంటి వాటి కారణంగా తలెత్తే అర్థిక అవసరాలకు సహాయపడుతుంది. నిధుల కొరత, లిక్విడిటీ సమస్యలకు పరిష్కారం చూపిస్తుంది.
అధిక రుణం పొందొచ్చు: క్రెడిట్ కార్డు పరిమితి ఎక్కువగా ఉంటే క్రెడిట్ కార్డుపై అధిక రుణం పొందొచ్చు. కార్డు జారీ సంస్థలు ఈ రుణాలను, ఎంపిక చేసిన వినియోగదారులకు మాత్రమే అందిస్తాయి. ఖర్చులు, చెల్లింపుల చరిత్ర సక్రమంగా ఉన్న వారికి మాత్రమే ఈ రకమైన రుణాలు అందుబాటులో ఉంటాయి. సాధారణంగా దరఖాస్తు చేసుకున్న రోజునే బ్యాంకులు ఈ రుణాలను వినియోగదారులకు అందిస్తాయి. కాబట్టి, పరిమితి పెంపు వల్ల అత్యవసరాల్లో అధిక మొత్తంలో రుణం పొందేందుకు వీలుంటుంది.
నష్టాలు..
రుణ భారం పెరగొచ్చు: క్రెడిట్ కార్డు లిమిట్ పెంచుకోవడం వల్ల వినియోగానికి ఎక్కువ మొత్తం అందుబాటులో ఉంటుంది. అవసరానికి మించి ఖర్చులు చేస్తే చెల్లింపులు కష్టమవుతాయి. దీంతో చాలా మంది కనీస మొత్తం చెల్లించి మిగిలిన మొత్తాన్ని తర్వాతి నెలకు వాయిదా వేస్తుంటారు. దీంతో వడ్డీ, ఫైనాన్స్ ఛార్జీలతో చెల్లించాల్సిన రుణం భారం అవుతుంది.
క్రెడిట్ స్కోరు తగ్గొచ్చు: క్రెడిట్ కార్డు బిల్లు సకాలంలో చెల్లించడంలో విఫలమైతే క్రెడిట్ స్కోరు తగ్గుతుంది. లిమిట్ ఎక్కువగా ఉన్నప్పటికీ ఖర్చులు పరిమితిలో ఉన్నంత వరకు పర్వాలేదు. కానీ ఖర్చులు అధికమై బిల్లు సకాలంలో చెల్లించపోతే క్రెడిట్ స్కోరు తగ్గుతుంది.
అధిక వడ్డీ: క్రెడిట్ కార్డు వినియోగదారులకు బ్యాంకులు వడ్డీ రహిత కాలవ్యవధిని అందిస్తాయి. ప్రతి నెలా సమయానికి వినియోగించిన పూర్తి మొత్తాన్ని తిరిగి చెల్లించాలి. ఒకవేళ తిరిగి చెల్లించకపోతే మరుసటి రోజు నుంచి వడ్డీ వర్తిస్తుంది. వార్షిక వడ్డీ 36 శాతం నుంచి 48 శాతం వరకు సంస్థను బట్టి ఉంటుంది. కొత్త కొనుగోళ్లకు వడ్డీ రహిత వ్యవధి ప్రయోజనం కోల్పోయే అవకాశం ఉంది.
క్రెడిట్ కార్డు పోగొట్టుకుంటే: ఒకవేళ మీరు క్రెడిట్‌కార్డు పోగొట్టుకున్నా, ఎవరైనా సైబర్ మోసగాళ్ల చేతికి చిక్కినా నష్టపోయే మొత్తం కూడా పెరుగుతుంది.
చివరిగా: క్రెడిట్ కార్డును బాధ్యతగా వాడుకున్నంత కాలం లిమిట్ పెంచుకోవడం వల్ల లాభమే గానీ నష్టం ఉండదు. ఖర్చులపై నియంత్రణ లేనివారు, క్రెడిట్ కార్డు వినియోగంపై అవగాహన లేని వారు మాత్రం లిమిట్‌ను పెంచుకోకపోవడమే మంచిది.
ఇవీ చూడండి: ఈఎంఐలు ఆలస్యంగా చెల్లిస్తే ఏం జరుగుతుందో తెలుసా