Amazon pressure cooker recall : నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా లేని ప్రెషర్ కుక్కర్లు అమ్మినందుకు అమెజాన్‌కు జరిమానా విధించింది సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ(సీసీపీఏ). లక్ష రూపాయలు చెల్లించాలని ఆదేశించింది. ఆ కుక్కర్లు అన్నింటినీ వెనక్కి తెప్పించాలని నిర్దేశించింది.
భారత్‌లో విక్రయించే వస్తువులు.. క్వాలిటీ కంట్రోల్ ఆర్డర్-క్యూసీఓలో పేర్కొన్న నాణ్యతా ప్రమాణాలకు తగినట్లు ఉండాలి. అయితే.. క్యూసీఓ నాణ్యతా ప్రమాణాలను అందుకోకపోయినా తన ప్లాట్‌ఫాం ద్వారా 2,265 ప్రెషర్ కుక్కర్లు విక్రయించేందుకు వెండర్లకు అమెజాన్ అనుమతి ఇచ్చిందని సీసీపీఏ గుర్తించింది. వీటి ద్వారా ఆ సంస్థ రూ.6,14,825 ఆర్జించిందని నిర్ధరించింది. నిబంధనలు ఉల్లంఘించినందుకు రూ.లక్ష జరిమానా విధించింది. నాణ్యత సరిగా లేని కుక్కర్లను కొన్న కస్టమర్లను సంప్రదించి, ఆ వస్తువుల్ని వెనక్కి తెప్పించి, వారికి డబ్బులు తిరిగి చెల్లించాలని అమెజాన్‌ను ఆదేశించింది సీసీపీఏ.