Adani Cement Deal: సిమెంటు రంగంలోనూ దిగ్గజ సంస్థగా నిలిచేందుకు అదానీ గ్రూప్ ముందడుగు వేసింది. స్విస్ సిమెంట్ అగ్రగామి సంస్థ హోల్సిమ్‌కు చెందిన భారత వ్యాపారాన్ని 10.5 బిలియన్ డాలర్ల (సుమారు రూ.81,361 కోట్ల)తో స్వాధీనం చేసుకునేందుకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు గౌతమ్ అదానీ నేతృత్వంలోని అదానీ గ్రూప్ ఆదివారం తెలిపింది. ఈ పోటీలో అల్ట్రాటెక్ సిమెంట్, జేఎస్‌డబ్ల్యూ గ్రూప్‌లను అదానీ వెనక్కి నెట్టింది. హోల్సిమ్ భారత వ్యాపారా (అంబుజా సిమెంట్స్, ఏసీసీ సిమెంట్స్)లను ఆఫ్‌షోర్ స్పెషల్ పర్పస్ వెహికల్ ద్వారా కొనుగోలు చేయడానికి అదానీ కుటుంబం ఒప్పందం కుదుర్చుకున్నట్లు అదానీ గ్రూప్ వెల్లడించింది. తద్వారా 70 మిలియన్ టన్నుల వార్షిక సామర్థ్యంతో దేశంలో రెండో అతిపెద్ద సిమెంట్ తయారీసంస్థగా అదానీ గ్రూప్ అవతరించనుంది.
ఇదీ లెక్క: హోల్సిమ్‌కు అంబుజా సిమెంట్‌లో 63.19 శాతం, ఏసీసీలో 4.48 శాతం వాటాలు ఉన్నాయి. ఏసీసీలో 50.05 శాతం వాటా అంబుజాకు ఉంది. అంటే ఏసీసీలో 54.53 శాతం వాటా హోల్సిమ్‌కు ఉంది. తాజా లావాదేవీతో ఈ రెండు దిగ్గజ సంస్థల నియంత్రిత వాటా అదానీకి లభించినట్లే. నౌకాశ్రయాలు, విమానాశ్రయాలు, విద్యుత్తుప్లాంట్లు, బొగ్గుగనులు, డేటాకేంద్రాలు, డిజిటల్ సేవలు, రిటైల్ విభాగాల్లో అగ్రగామిగా ఉన్న అదానీ, సిమెంటు రంగంలోనూ దూసుకెళ్లేందుకే ఈ భారీ ఒప్పందం కోసం తీవ్రంగా ప్రయత్నించి, సాధించారు.ఇప్పటికే అదానీ ఎంటర్‌ప్రైజెస్‌కు 2 సిమెంట్ అనుబంధ సంస్థలున్నాయి. ఈ లావాదేవీతో దేశం నుంచి ఉపసంహరణకు గురైన అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి (ఎఫ్‌డీఐ) హోల్సిమ్‌దే అవుతుంది.
మరో 26 శాతం వాటా కొనుగోలుకు ఓపెన్ ఆఫర్: సెబీ నిబంధనల ప్రకారం నాన్-ప్రమోటర్ వాటాదార్ల నుంచి అంబుజా, ఏసీసీ కంపెనీల్లో 26 శాతం వాటా కొనుగోలు చేయడానికి అదానీ కుటుంబం ఓపెన్ ఆఫర్ ఇవ్వనుంది. హోల్సిమ్ వాటా, ఓపెన్ ఆఫర్ విలువతో ఇది అదానీ చేపట్టనున్న అతిపెద్ద కొనుగోలు కానుంది. మౌలిక సదుపాయాలు, మెటీరియల్స్ విభాగంలో అతిపెద్ద లావాదేవీగా రికార్డు సృష్టించనుంది. సిమెంట్ వ్యాపారంలో అడుగుపెట్టడం, దేశ వృద్ధి ప్రయాణంపై తమ విశ్వాసానికి ప్రతీకని గౌతమ్ అదానీ పేర్కొన్నారు. ఈ లావాదేవీకి నియంత్రణపరమైన అనుమతులు లభించాల్సి ఉంటుంది.
- ఈ లావాదేవీని ముగించడానికి ఆదిత్య బిర్లా గ్రూప్ సంస్థ అల్ట్రాటెక్ (119.95 మిలియన్ టన్నుల సిమెంట్ తయారీ సామర్థ్యం) అదనపు సమయం కోరింది. గుజరాత్, మధ్యప్రదేశ్‌ల్లోని ప్లాంట్‌లను విక్రయిస్తామని హామీ ఇచ్చింది. ఇదే సమయంలో సాధ్యమైనంత తొందరగా లావాదేవీ పూర్తిచేస్తామని హామీ ఇవ్వడం అదానీ గ్రూప్‌నకు కలిసొచ్చింది.
- శుక్రవారం అంబుజా షేరు రూ.359; ఏసీసీ షేరు రూ.2114 వద్ద ముగిశాయి. ఈ ప్రకారం అంబుజా మార్కెట్ విలువ రూ.71,250 కోట్లుగా ఉంది.
- ఏసీసీ: 17 సిమెంట్ తయారీ యూనిట్‌లు, 9 క్యాప్టివ్ పవర్ ప్లాంట్‌లు, 6,643 మంది ఉద్యోగులు, 56,000 డీలర్లు, రిటైలర్ల నెట్‌వర్క్ ఉంది.
- అంబుజా సిమెంట్స్: 6 సమ్మిళిత తయారీ ప్లాంట్లు, 8 సిమెంట్ గ్రైండింగ్ యూనిట్లతో 31 మిలియన్ మెట్రిక్ టన్నుల సిమెంటు వార్షిక తయారీ సామర్థ్యం.
క్వింటిలియన్ బిజినెస్ మీడియాలో అదానీకి 49% వాటా : గౌతమ్ అదానీకి చెందిన అదానీ ఎంటర్‌ప్రైజెస్ అనుబంధ సంస్థ ఏఎంజీ మీడియా నెట్‌వర్క్స్, రాఘవ్ భల్‌కు చెందిన డిజిటల్ బిజినెస్ న్యూస్ ప్లాట్‌ఫామ్ క్వింటిలియన్ బిజినెస్ మీడియా ప్రై.లి. (క్యూబీఎంఎల్)లో 49 శాతం వాటా కొనుగోలు చేయబోతున్నట్లు ఎక్స్ఛేంజీలకు సమాచారమిచ్చింది. ఎంత మొత్తానికి ఒప్పందం జరిగిందీ వెల్లడించలేదు. క్యూబీఎంఎల్‌లో మైనార్టీ వాటా కొనుగోలు చేయడం ద్వారా మీడియా వ్యాపారంలోకి అడుగుపెట్టబోతున్నట్లు గత మార్చిలో అదానీ ఎంటర్‌ప్రైజెస్ ప్రకటించింది. క్వింటిలియన్ మీడియా లిమిటెడ్ (క్యూఎంఎల్), క్యూబీఎంఎల్‌తో వాటాదార్ల ఒప్పందం (ఎస్‌హెచ్‌ఏ), క్యూఎంఎల్, క్యూబీఎంఎల్, క్వింట్ డిజిటల్ మీడియా లిమిటెడ్‌లతో (క్యూడీఎంఎల్) వాటా కొనుగోలు ఒప్పందాన్ని (ఎస్‌పీఏ) చేసుకున్నట్లు అదానీ ఎంటర్‌ప్రైజెస్ ఎక్స్ఛేంజీలకు సమాచారమిచ్చింది.
ఇదీ చదవండి: ఆ రోజు చనిపోతాననుకున్నా: గౌతమ్ అదానీ