Tax Collections India: మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో పన్ను వసూళ్లు రికార్డు స్థాయికి చేరినట్లు కేంద్ర రెవెన్యూశాఖ కార్యదర్శి తరుణ్ బజాజ్ తెలిపారు. 2021-22 ఆర్థిక ఏడాదిలో మొత్తం రూ.27.07 లక్షల కోట్ల పన్నులు వసూలైనట్లు వెల్లడించారు. ఇది బడ్జెట్ అంచనా వేసిన రూ.22.17 లక్షల కోట్లతో పోలిస్తే అధికమని వివరించారు.
ప్రత్యక్ష పన్నుల పరిధిలోకి వచ్చే వ్యక్తి ఆదాయపు పన్ను, కార్పొరేట్ పన్నులు కలిపి రూ.14.10 లక్షల కోట్లు వచ్చినట్లు తరుణ్ బజాజ్ తెలిపారు. బడ్జెట్ అంచనాలతో పోలిస్తే ఇది రూ.3.02 లక్షల కోట్లు ఎక్కువని పేర్కొన్నారు. రూ.1.88 లక్షల కోట్ల ఎక్సైజ్ డ్యూటీతో కలుపుకొని మొత్తం పరోక్ష పన్నులు రూ.12.90 లక్షల కోట్లు వసూలైనట్లు తెలిపారు. బడ్జెట్‌లో వీటిని రూ.11.02 లక్షల కోట్లుగా అంచనా వేసినట్లు వెల్లడించారు. ప్రత్యక్ష పన్నుల్లో 49 శాతం, పరోక్ష పన్నుల్లో 30 శాతం వృద్ధి నమోదైనట్లు తెలిపారు. జీడీపీలో పన్నుల వాటా 11.7 శాతం పెరిగినట్లు పేర్కొన్నారు. 1999 తర్వాత ఇదే అత్యధిక వృద్ధి అని వివరించారు.
ఇదీ చదవండి: కార్డు లేకుండానే నగదు ఉపసంహరణ.. ఇకపై అన్ని బ్యాంకుల్లో!