ఒపెక్ దేశాల మధ్య జరిగిన చారిత్రక ఒప్పందంతో చమురు ధరలు భారీగా పెరిగాయి. వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియేట్ సూచీ 7.7 శాతం వృద్ధి నమోదు చేసి బ్యారెల్ ధర 24.52 డాలర్లకు చేరింది. బ్రెంట్ సూచీ 5 శాతం ఎగబాకి బ్యారెల్ ధర 33 డాలర్లకు పెరిగింది.
చారిత్రక ఒప్పందం..
కరోనా సంక్షోభం, రష్యా-సౌదీ మధ్య చముర యుద్ధం కారణంగా భారీగా పడిపోయిన క్రూడాయిల్‌కు మద్దతు ధర లభించే విధంగా ఒపెక్ దేశాలు చారిత్రక ఒప్పందం చేసుకున్నాయి. మే, జూన్ నెలల్లో రోజుకు 10 మిలియన్ బ్యారెల్ల చమురు ఉత్పత్తి తగ్గించేందుకు శుక్రవారం నిర్ణయం తీసుకున్నాయి.
ఇందులో స్వల్ప మార్పులు చేస్తూ తగ్గింపును 9.7 మిలియన్ బ్యారెళ్లలకు పరిమితం చేయాలని ఆదివారం నిర్ణయించారు. ఈ కోతలను 2022 ఏప్రిల్ వరకు నెమ్మదిగా ఎత్తివేయాలని చమురు ఎగుమతి దేశాలు, భాగస్వాముల మధ్య ఒప్పందం కుదిరింది.
స్వాగతించిన ట్రంప్..
ఈ ఒప్పందాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వాగతించారు. ఇంధన రంగంపై ఆధారపడ్డ వేలాది మంది ఉపాధికి భరోసా కల్పించారని పేర్కొన్నారు. ఇందుకు కృషి చేసిన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, సౌదీ యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
ఇదీ చూడండి: చమురు ఉత్పత్తి తగ్గింపుపై ఒపెక్ దేశాల కీలక ఒప్పందం