వరుసగా రెండు రోజుల లాభాల తర్వాత గురువారం స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ముగిశాయి. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సూచీ సెన్సెక్స్ 770 పాయింట్లు కోల్పోయి 58,788 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజి సూచీ నిఫ్టీ 219 పాయింట్లు క్షీణించి.. 17,560 వద్ద సెషన్‌ను ముగించింది.
ఇంట్రాడే సాగిందిలా..
బడ్జెట్ సానుకూల ప్రభావంతో వరుసగా రెండురోజులు లాభాలను ఆర్జించిన స్టాక్ మార్కెట్లు గురువారం సెషన్లో ఏమాత్రం జోరు ప్రదర్శించలేదు. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సూచీ సెన్సెక్స్ ఉదయం 59,528 పాయింట్ల వద్ద స్వల్ప నష్టాలతో ప్రారంభమైంది. ఆ తర్వాత మిడ్ సెషన్ వరకు ఒడుదొడుకులతో కొనసాగింది. 58,653 పాయింట్ల వద్ద కనిష్ఠాన్ని తాకింది. చివరకు 770 పాయింట్లు కోల్పోయి 58,788 వద్ద స్థిరపడింది.
జాతీయ స్టాక్ ఎక్స్చేంజి సూచీ నిఫ్టీ 17,767 పాయింట్ల వద్ద నష్టాలతో ప్రారంభమైంది. ఆ తర్వాత 17,781 వద్ద గరిష్ఠస్థాయికి చేరుకుంది. 17,511 వద్ద కనిష్ఠాన్ని నమోదు చేసింది. ఆ తర్వాత 219 పాయింట్లు క్షీణించి.. 17,560 వద్ద సెషన్‌ను ముగించింది.
లాభనష్టాల్లోనివి ఇవే..
- సెన్సెక్స్ 30 షేర్లలో మారుతీ, టైటాన్, ఏషియన్ పెయింట్స్, ఐటీసీ, టాటా స్టీల్, యాక్సిస్ బ్యాంకు షేర్లు లాభాల్లో ఉన్నాయి.
- సన్‌ఫార్మా, ఎన్టీపీసీ, టీసీఎస్, అల్ట్రాసెమ్కో, ఎస్బీఐఎన్, ఐసీఐసీఐ, భారతీ ఎయిర్టెల్, నెస్లే ఇండియా, ఎల్టీ, హిందుస్థాన్ యూనిలీవర్, ఎల్ అండ్ టీ, డాక్టర్ రెడ్డీస్ షేర్లు నష్టపోయాయి.