స్టాక్ మార్కెట్లలో బుధవారం కూడా రికార్డుల పరంపర కొనసాగింది. బీఎస్ఈ- సెన్సెక్స్ (Sensex today) 546 పాయింట్లు పెరిగి నూతన గరిష్ఠ స్థాయి అయిన 54,370 వద్ద స్థిరపడింది. ఎన్ఎస్ఈ-నిఫ్టీ (Nifty today) 128 పాయింట్ల లాభంతో జీవనకాల గరిష్ఠమైన 16,259 వద్దకు చేరింది.
జులై జీఎస్‌టీ వసూళ్లు తిరిగి రూ.లక్ష కోట్లను మించడం, ఎగుమతులు పెరగడం, వాహన విక్రయాల్లో రెండంకెల వృద్ధి, తయారీ రంగం పుంజుకోవడం, కంపెనీల ఆర్థిక ఫలితాలు ఆకర్షణీయంగా ఉండటం లాంటివి మదుపరుల్లో ఉత్సాహాన్ని నింపాయి. ఆర్థిక వ్యవస్థ తిరిగి పుంజుకుంటోందనే భావనతో వాళ్లు కొనుగోళ్లకు మొగ్గు చూపారు. ఫలితంగా సూచీలు కొత్త శిఖరాలను తాకాయి. దీనికి తోడు దేశీయంగా, అంతర్జాతీయంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతంగా జరుగుతుండటం కూడా మార్కెట్లకు కలిసిసొచ్చిన అంశంగా చెబుతున్నారు విశ్లేషకులు.
ఇంట్రాడే సాగిందిలా (Intraday)..
సెన్సెక్స్ 54,465 పాయింట్ల అత్యధిక స్థాయి (జీవితకాల గరిష్ఠం) 54,034 పాయింట్ల అత్యల్ప స్థాయిలను నమోదు చేసింది.
నిఫ్టీ 16,290 పాయింట్ల గరిష్ఠ స్థాయి (నూతన రికార్డు స్థాయి), 16,176 పాయింట్ల కనిష్ఠ స్థాయిల మధ్య కదలాడింది.
లాభనష్టాల్లోనివి ఇవే..
- హెచ్డీఎఫ్సీ, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఎస్బీఐ షేర్లు ప్రధానంగా లాభాలను గడించాయి.
- టైటాన్, నెస్లే ఇండియా, సన్‌ఫార్మా, అల్ట్రాటెక్ సిమెంట్, మారుతీ సుజుకీ షేర్లు ఎక్కువగా నష్టపోయాయి.
ఇతర మార్కెట్లు
ఆసియాలో ఇతర ప్రధాన మార్కెట్లలో షాంఘై, కోస్పీ, హాంగ్‌సెంగ్ సూచీలు లాభాలను గడించాయి. నిక్కీ మాత్రం నష్టాలను మూటగట్టుకుంది.
ఇదీ చదవండి: ఏపీ, తెలంగాణల్లో బంగారం, వెండి ధరలు ఎంతంటే..