దేశీయ స్టాక్ మార్కెట్లు మరోసారి రికార్డులు సృష్టించాయి. బుల్ జోరుతో సోమవారం.. బీఎస్ఈ-సెన్సెక్స్ (Sensex today) 765 పాయింట్లు పెరిగి జీవనకాల గరిష్ఠమైన 56,890 వద్ద స్థిరపడింది. ఎన్ఎస్ఈ-నిఫ్టీ (Nifty today) 226 పాయింట్ల లాభంతో తొలిసారి 16,931 వద్ద ముగిసింది.
అంతర్జాతీయ మార్కెట్ల సానుకూలతలు మదుపరుల సెంటిమెంట్‌ను మరింత బలపరిచాయి. దీనికి తోడు టెక్ మినహా అన్ని రంగాల షేర్లు రాణించడం వల్ల సూచీలు ఈ స్థాయిలో దూసుకెళ్లినట్లు విశ్లేషకులు చెబుతున్నారు. రైట్స్ ఇష్యూ ద్వారా రూ.21,000 కోట్ల నిధులను సమీకరించే ప్రతిపాదనకు భారతీ ఎయిర్‌టెల్ డైరెక్టర్ల బోర్డు ఆమోదం తెలపడం వల్ల ఆ కంపెనీ షేర్లు భారీగా పుంజుకున్నాయి.
ఇంట్రాడే సాగిందిలా (Intraday)..
సెన్సెక్స్ 56,958 (జీవనకాల గరిష్ఠం) పాయింట్ల అత్యధిక స్థాయి, 56,309 పాయింట్ల అత్యల్ప స్థాయిలను నమోదు చేసింది.
నిఫ్టీ 16,951 పాయింట్ల గరిష్ఠ స్థాయి (నూతన రికార్డు), 16,764 పాయింట్ల కనిష్ఠ స్థాయిల మధ్య కదలాడింది.
లాభనష్టాల్లోనివి ఇవే..
భారతీ ఎయిర్‌టెల్, యాక్సిస్ బ్యాంక్, టాటా స్టీల్, టైటాన్, మారుతీ షేర్లు భారీగా లాభాలను గడించాయి.
నెస్లే ఇండియా, టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, టీసీఎస్ మాత్రమే 30 షేర్ల ఇండెక్స్‌లో నష్టాలను నమోదు చేశాయి.
ఇతర మార్కెట్లు
ఆసియాలో ఇతర ప్రధాన మార్కెట్లలో.. షాంఘై (చైనా), నిక్కీ (జపాన్), కోస్పీ (దక్షిణ కొరియా), హాంగ్‌సెంగ్ (హాంకాంగ్) సూచీలూ లాభాలను నమోదు చేశాయి.
ఇదీ చదవండి: సెప్టెంబర్ నుంచి మారుతీ కార్లు మరింత ప్రియం!