స్టాక్ మార్కెట్లలో మంగళవారం కూడా రికార్డుల పరంపర కొనసాగింది. బుల్ జోరుతో బీఎస్ఈ-సెన్సెక్స్ (Sensex today) 210 పాయింట్లు పెరిగి జీవనకాల గరిష్ఠమైన 55,792 వద్ద స్థిరపడింది. ఎన్ఎస్ఈ-నిఫ్టీ (Nifty today) 51 పాయింట్ల లాభంతో సరి కొత్త రికార్డు స్థాయి అయిన 16,615 వద్ద ముగిసింది.
ఆసియాలో ఇతర ప్రధాన మార్కెట్లన్నీ నష్టాల్లో ఉన్నా.. దేశీయ సూచీలు మాత్రం వరుస లాభాలతో దూసుకుపోతుండటం విశేషం. అఫ్గాన్ సంక్షోభం నేపథ్యంలో మదుపరులు కాస్త ఆచితూచి వ్యవహరించినట్లు తెలుస్తోంది. ఈ కారణంగా సూచీలు ఒడుదొడుకులకు లోనయ్యాయి. అయితే ఐటీ, ఎఫ్ఎంసీజీ షేర్లు సానుకూలంగా స్పందించడం వల్ల ఒడుదొడుకుల నుంచి తేరుకోగలిగాయి.
ఇంట్రాడే సాగిందిలా (Intraday)..
సెన్సెక్స్ 55,854 పాయింట్ల అత్యధిక స్థాయి (జీవనకాల గరిష్ఠం), 55,386 పాయింట్ల అత్యల్ప స్థాయిలను నమోదు చేసింది.
నిఫ్టీ 16,628 పాయింట్ల గరిష్ఠ స్థాయి (నూతన రికార్డు స్థాయి), 16,495 పాయింట్ల కనిష్ఠ స్థాయిల మధ్య కదలాడింది.
లాభనష్టాల్లోనివి ఇవే..
టెక్ మహీంద్రా, నెస్లే, హెచ్‌యూఎల్, టైటాన్, టీసీఎస్ షేర్లు ప్రధానంగా లాభాల్లో ఉన్నాయి.
ఇండస్ఇండ్ బ్యాంక్, ఎన్టీపీసీ, భారతీ ఎయిర్టెల్, టాటా స్టీల్, ఎల్&టీ ఎక్కువగా నష్టపోయాయి.
ఇతర మార్కెట్లు
ఆసియాలో ఇతర ప్రధాన మార్కెట్లలో.. షాంఘై (చైనా), నిక్కీ (జపాన్), కోస్పీ (దక్షిణ కొరియా), హాంగ్‌సెంగ్ (హాంకాంగ్) సూచీలు నష్టాలను నమోదు నమోదు చేశాయి.
ఇదీ చదవండి: పసిడి మదుపరులకు యూబీఎస్ హెచ్చరిక!