స్టాక్ మార్కెట్ల ఏడు రోజుల వరుస లాభాలకు బ్రేక్ పడింది. మంగళవారం లాభాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. బుల్ జోరుతో ఒకానొకదశలో జీవితకాల గరిష్ఠానికి చేరుకున్న సూచీలు.. మదుపరులు లాభాల స్వీకరణకు మొగ్గుచూపడం వల్ల ఆరంభ లాభాలు ఆవిరై నష్టాలు చవిచూశాయి.
ఇంట్రాడే సాగిందిలా..
బాంబే స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్(Bse sensex) మంగళవారం ఉదయం 62,156 వద్ద ప్రారంభమైంది. ఒక దశలో భారీగా పుంజుకుని 62,245 పాయింట్ల జీవితకాల గరిష్ఠాన్ని తాకింది. ఆ తర్వాత లాభాల స్వీకరణకు మదుపరులు మొగ్గు చూపటం వల్ల 49 పాయింట్లు కోల్పోయి 61,716 వద్ద ముగిసింది.
జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ నిఫ్టీ(nifty today) ఉదయం 18,602 వద్ద ప్రారంభం కాగా.. ఒక దశలో 18,604 పాయింట్ల జీవితకాల గరిష్ఠాన్ని తాకింది. చివరకు 58 పాయింట్ల నష్టంతో 18,418 వద్ద స్థిరపడింది.
లాభనష్టాల్లోనివి..
టెక్ మహీంద్రా 4.46 శాతం మేర లాభపడగా.. ఎల్ అండ్ టీ(3.54శాతం), ఇన్ఫోసిస్ 1.69 శాతం , బజాజ్ ఫిన్సెర్వ్ 1.67 శాతం, కొటక్ బ్యాంక్ 1.29 శాతం మేర లాభపడ్డాయి.
ఐటీసీ 6.27 శాతం మేర నష్టపోయింది. హిందుస్థాన్ యూనిలివర్ 3.70, టైటాన్ 3.53, పవర్ గ్రిడ్ 3.34, టాటాస్టీల్ 3.13శాతం మేర నష్టాలను మూటగట్టుకున్నాయి.
ఇవీ చూడండి: 'రైల్వే' అరుదైన ఘనత- రూ.లక్ష కోట్ల క్లబ్‌లోకి ఐఆర్సీటీసీ