లాక్డౌన్ ముగియడానికి ముందు కేంద్రం మరో ఆర్థిక ఉద్దీపన ప్యాకేజీ ప్రకటిస్తుందన్న అంచనాలతో స్టాక్ మార్కెట్లు లాభాల్లో దూసుకెళ్లాయి. ప్రపంచ వ్యాప్తంగా కొవిడ్ ప్రభావం తగ్గుతోందన్న విశ్లేషణలు సైతం మదుపర్లలో ఉత్సాహం నింపాయి. దీంతో దేశీయ స్టాక్‌మార్కెట్లు భారీ లాభాలు నమోదు చేశాయి.
1266 పాయింట్లు లాభపడిన బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ సెన్సెక్స్.. 31,160 వద్ద ముగిసింది. వాహన రంగ షేర్లు ఆకాశమే హద్దుగా చెలరేగాయి. మహీంద్ర అండ్ మహీంద్ర 15 శాతం, మారుతీ 12 శాతం, హీరో మోటోకార్ప్ 9.63 శాతం లాభపడ్డాయి.
వీటితో పాటు టైటాన్, బజాజ్ ఫైనాన్స్ సహా బ్యాంకింగ్ రంగ సంస్థలైన హెచ్డీఎఫ్సీ, కోటక్, ఐసీఐసీఐ, యాక్సిస్ బ్యాంక్‌ల షేర్లు భారీగా వృద్ధి చెందాయి.
ఇండస్ఇండ్ బ్యాంక్, టెక్ మహీంద్ర, హిందూస్థాన్ యూనిలివర్ షేర్లు మాత్రం నష్టాల్లో ముగిశాయి.
నిఫ్టీ సైతం లాభాల్లోనే
సెన్సెక్స్ బాటలోనే పయనించిన నిఫ్టీ... భారీ లాభాలు నమోదు చేసింది. 363 పాయింట్లు వృద్ధి చెంది 9112 పాయింట్ల వద్ద స్థిరపడింది. నిఫ్టీలోని 50 షేర్లలో 6 మినహా అన్ని కంపెనీల షేర్లు లాభాలు గడించాయి.