కేంద్ర బడ్జెట్, స్థూల ఆర్థిక గణాంకాలు, రిజర్వు బ్యాంకు ద్రవ్యపరపతి విధానం, దిగ్గజ సంస్థల త్రైమాసిక ఫలితాల విడుదల నేపథ్యంలో ఈ వారం స్టాక్ మార్కెట్లు ఒడుదొడుకులకు లోనయ్యే అవకాశముందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
ప్రస్తుతం అందరి చూపు కేంద్రం ప్రవేశపెట్టబోయే బడ్జెట్‌పైనే ఉంది. దేశ ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టేలా సానుకూల నిర్ణయాలు ఉంటాయని మదుపరులు ఆశిస్తున్నారు. అలా జరగదని భావిస్తే మార్కెట్లు భారీ దిద్దుబాటు చర్యలకు లోనవుతాయి.
-అజిత్ మిశ్రా, రెలిగేర్ బ్రోకింగ్ లిమిటెడ్ ఉపాధ్యక్షుడు.
బడ్జెట్‌పై అంచనాలతో మదుపరులు లాభాల స్వీకరణకు మొగ్గుచూపుతారు.. ఈ క్రమంలో మార్కెట్లు తీవ్ర హెచ్చుతగ్గులకు లోనయ్యే ప్రమాదముంది.
-సిద్ధార్థ్ ఖేమ్కా, మోతీలాల్ ఓస్వాల్ రిటైల్ హెడ్
త్రైమాసిక ఫలితాలే కీలకం..
బడ్జెట్ వారంలో దేశీయ మర్కెట్లకు దిశా నిర్దేశం చేయనున్న అంశాలను గమనిస్తే.. వివిధ కంపెనీల త్రైమాసిక ఫలితాలపై మదుపరులు దృష్టి సారించే అవకాశాలున్నాయి. ప్రధానంగా.. హెచ్డీఎఫ్సీ, అదానీపవర్, హీరో మోటోకార్ప్, ఎంఅండ్ఎం వంటి కంపెనీలు తమ ఫలితాలను ప్రకటించనున్నాయి.
వడ్డీరేట్లపై ఆర్బీఐ నిర్ణయాలు సైతం దేశీయ మార్కెట్లలో సెంటిమెంట్లను ప్రభావితం చేయొచ్చని నిపుణులు అంటున్నారు.
గణాంకాలూ ముఖ్యమే..
ఉత్పత్తి, సేవా రంగాల గణాంకాలపై ఈ వారం వెలువడనున్న పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్(పీఎంఐ) సైతం మార్కెట్ల గమనానికి కీలకం కానుంది. ఇక సోమవారం విడుదల కానున్న వాహన విక్రయ గణాంకాలను(నెలవారీ) మదుపరులు పరిగనణలోకి తీసుకుంటారని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. విదేశీ మదుపరులు సైతం భారత మార్కెట్లను అంచనా వేస్తూ ముందుకు సాగే అవకాశం ఉంది.
ఇవీ చదవండి: 'స్టాక్ మార్కెట్ నుంచి డబ్బులు వెనక్కి వెళ్తాయ్'
బడ్జెట్ 2021: అంకురాల ఆశలు నెరవేరేనా?