స్టాక్ మార్కెట్ల వరుస నష్టాలకు బ్రేక్ పడింది. కరోనా మరణాల రేటు తగ్గుతున్న క్రమంలో ఆసియా మార్కెట్లు సానుకూలంగా స్పందించటం కలిసొచ్చింది. ఫలితంగా దేశీయ మార్కెట్లు ఉదయం నుంచి పరుగులు పెట్టాయి.
బాంబే స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ-సెన్సెక్స్ 428 పాయింట్లు లాభపడి 41,323కు చేరుకుంది. 133 పాయింట్లు వృద్ధి చెందిన జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ-నిఫ్టీ 12,125 పాయింట్ల వద్ద స్థిరపడింది.
తొలగిన కరోనా భయాలు..
కొత్త కరోనా వైరస్ కేసుల తగ్గుదలతో మదుపరుల సెంటిమెంటు బలపడింది. ఆర్థిక వ్యవస్థపై వైరస్ ప్రభావాన్ని నియంత్రించేందుకు కేంద్రం చర్యలు ప్రారంభించింది. ఈ మేరకు పరిశ్రమ వర్గాలతో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం భేటీ అయ్యారు. త్వరలోనే పరిష్కార మార్గాలపై నిర్ణయం తీసుకుంటామన్న మంత్రి ప్రకటనతో మార్కెట్లు సానుకూలంగా స్పందించాయి.
లాభ నష్టాల్లో..
కోల్ ఇండియా, హిందుస్థాన్ యూనిలీవర్, భారతి ఇన్ఫ్రాటెల్, బజాజ్ ఫినాన్స్, రిలయన్స్, ఓఎన్జీసీ, హెచ్డీఎఫ్సీ లాభాల్లో సాగాయి.
టాటా మోటార్స్, జేఎస్డబ్ల్యూ స్టీల్, సన్ ఫార్మా, భారతీ ఎయిర్టెల్, టీసీఎస్ నష్టపోయాయి.
ఆసియా మార్కెట్లు భారీ లాభాల్లో ముగిశాయి.