Stock Market Today: వరుసగా నష్టాలను చవిచూసిన స్టాక్ మార్కెట్లు ఎట్టకేలకు లాభాల బాట పట్టాయి. మంగళవారం ఉదయం కూడా భారీ నష్టాలతో ప్రారంభమైనప్పటికీ ఆ తర్వాత కోలుకున్నాయి. అంతర్జాతీయంగా సానుకూల ఫలితాలు, బ్యాంకింగ్, ఆర్థిక రంగ షేర్లు బలపడటం మార్కెట్లకు అనుకూలంగా మారింది. దీంతో సెన్సెక్స్ 367 పాయింట్లు మెరుగుపడి 57,858కి చేరింది. నిఫ్టీ 129 పాయింట్లు వృద్ధి చెంది 17,278కి పెరిగింది.
ఇంట్రాడే..
ఉదయం సెషన్‌ను 57వేల 536 పాయింట్లతో ప్రారంభించిన సెన్సెక్స్ కొద్దిసేపటికే 300 పాయింట్లు కోల్పోయింది. ఆ తర్వాత దాదాపు 1000 పాయింట్ల వరకు కుప్పకూలింది. ఒకానొక దశలో 56వేల400కు పడిపోయింది. ఆ తర్వాత తీవ్ర ఒడుదొడుకులను ఎదుర్కొని మెల్లగా లాభాల బాట పట్టింది. మొదట 100 పాయింట్లు వృద్ధి చెందింది. అప్పటినుంచి అంతకంతకూ పెరుగుతూ చివరకు 367పాయింట్ల లాభాన్ని ఆర్జించింది. నిఫ్టీ కూడా ఇదే పరిస్థితిని ఎదుర్కొని 129 పాయింట్లు వృద్ధి చెందింది.
లాభనష్టాల్లోనివి
అత్యధికంగా యాక్సిస్ బ్యాంకు షేర్లు 7శాతానికిపైగా లాభపడ్డాయి. మారుతి 6.5శాతం వృద్ధి చెందింది. ఎస్బీఐఎన్, ఇండస్ఇండ్, భారతీ ఎయిర్టెల్, పవర్ గ్రిడ్, ఎన్టీపీసీ, హిందుస్థాన్ యూనిలివర్ షేర్లు లాభాలను ఆర్జించాయి.
హెచ్డీఎఫ్సీ, రిలయన్స్, ఏషియన్ పెయింట్స్, విప్రో, బజాజ్ ఫిన్సర్వ్ షేర్లు నష్టాలను చవిచూశాయి.