భారీ నష్టాల్లో మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం ప్రారంభ సెషన్లో భారీ నష్టాలతో కొనసాగుతున్నాయి. ఒకానొక దశలో 1,400 పాయింట్లు కోల్పోయిన బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ- సెన్సెక్స్.. ప్రస్తుతం 1,166 పాయింట్ల నష్టంతో కొనసాగుతోంది.
నిఫ్టీ కూడా తొలుత 400 పాయింట్లకు పైగా క్షీణించింది. ప్రస్తుతం 315 పాయింట్ల కోల్పోయి 10,953 పాయింట్ల వద్ద ట్రేడవుతుంది.
కరోనా వైరస్ ప్రభావంతో వృద్ధిపై భయాలు నెలకొన్న వేళ ప్రపంచ వ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు కుదేలయ్యాయి. విదేశీ మారక నిల్వల తరలింపు కూడా భారీ ప్రభావం చూపింది.
యెస్ బ్యాంకు ప్రభావం..
ఒకప్పుడు మదుపరులకు ఎంతో ఇష్టమైన యెస్ బ్యాంకుపై భారత రిజర్వ్ బ్యాంక్ అనూహ్య నిర్ణయం తీసుకుని మారటోరియం విధించింది. ఒక్కో ఖాతా నుంచి నగదు ఉపసంహరణపై ఆంక్షలు విధించింది. నెలకు రూ.50 వేల పరిమితి విధించింది.
పునరుజ్జీవ ప్రణాళిక అంటూ ఏదీ లేకపోవటం వల్లనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆర్బీఐ తెలిపింది. యెస్ బ్యాంకులో వాటా కొనుగోళ్లకు రంగం సిద్ధమైనట్లు కనిపిస్తున్న నేపథ్యంలో ఎస్బీఐ సగం దక్కించుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఈ పరిస్థితుల్లో యెస్ బ్యాంక్ షేరు విలువ 24.97 శాతం పడిపోయింది. ఎస్బీఐ కూడా 6 శాతం మేర నష్టపోయింది.
భారీ నష్టాల్లోనివి..
స్టాక్ మార్కెట్లలో అన్ని రంగాల షేర్లు నష్టాల్లోనే కొనసాగుతున్నాయి. ఇండస్ఇండ్ బ్యాంక్, బజాజ్ ఫినాన్స్, ఐసీఐసీఐ బ్యాంక్, ఎల్ అండ్ టీ, యాక్సిస్ బ్యాంక్ భారీ నష్టాల్లో ఉన్నాయి.
అంతటా నష్టాలే...
ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై కరోనా ప్రభావంతో భారీ అనిశ్చితి నెలకొంది. అంతర్జాతీయ మార్కెట్లలో మదుపరులు భారీ అమ్మకాలకు మొగ్గుచూపారు.
ఆసియా మార్కెట్లలో షాంఘై, హాంకాంగ్, దక్షిణ కొరియా, జపాన్ 3 శాతం నష్టపోయాయి. అమెరికా మార్కెట్లు కూడా గురువారం 3 శాతం మేర నష్టపోయాయి.