Stock Market closing: స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ముగిశాయి. అంతర్జాతీయంగా బలహీన పవనాలు, ఆసియా మార్కెట్లు డీలా పడటం వంటి కారణాలతో.. సెన్సెక్స్ 700 పాయింట్లకు పైగా పతనమైంది.
తొలుత సెషన్‌ను లాభాలతోనే ప్రారంభించిన సూచీలు.. హెవీ వెయిట్ షేర్ల పతనంతో నష్టాల్లోకి మళ్లాయి. బొంబయి స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ సెన్సెక్స్.. 709 పాయింట్లు కోల్పోయింది. చివరకు 55,776 వద్ద స్థిరపడింది. 30 షేర్ల ఇండెక్స్‌లో టాటా స్టీల్, టెక్ మహీంద్ర, హెచ్‌సీఎల్ టెక్, టీసీఎస్, విప్రో వంటి షేర్లు భారీగా నష్టపోయాయి. వాహన రంగ షేర్లు రాణించాయి.
అటు, నిఫ్టీ సైతం నష్టాల్లోనే ముగిసింది. 208 పాయింట్లు పతనమై 16,663 వద్ద స్థిరపడింది.
పేటీఎం ఢమాల్
పేటీఎం పేమెంట్స్ బ్యాంకుపై ఆర్బీఐ ఆంక్షలు విధించిన నేపథ్యంలో ఆ సంస్థ షేరు పతనమవుతోంది. బీఎస్ఈలో సోమవారం 13 శాతం వరకు క్షీణించిన పేటీఎం.. మంగళవారం మరో 12.74 శాతం పడిపోయింది. నాలుగు నెలల వ్యవధిలోనే షేరు ఇష్యూ ధరలో 69 శాతం విలువ హరించుకుపోయింది. 2021 నవంబరులో పేటీఎం పబ్లిక్ ఇష్యూకు వచ్చినప్పుడు ఇష్యూ ధర రూ.2,150 కాగా.. మంగళవారం ట్రేడింగ్ ముగిసేనాటికి రూ.589.30కి దిగివచ్చింది.
ఇదీ చదవండి: చైనా కంపెనీలకు పేటీఎమ్ పేమెంట్స్ బ్యాంక్ డేటా లీక్.. నిజమెంత?
ఆసియా మార్కెట్లు ఇలా...
చైనాలో కరోనా వైరస్ భయాలు ఆసియా స్టాక్ మార్కెట్లపై ప్రభావం చూపాయి. హాంకాంగ్, షాంఘై మార్కెట్లు భారీగా పతనమయ్యాయి. రష్యా- ఉక్రెయిన్ యుద్ధం, చమురు ధరలు సైతం మార్కెట్లను ప్రభావితం చేశాయి. ఫెడ్ వడ్డీ రేట్ల నిర్ణయంపై భయాందోళనలు.. మదుపర్లను అమ్మకాలకు దిగేలా చేశాయి.
ఇదీ చదవండి: డబ్బు పొదుపు చేయడంలో ఇబ్బందులా? ఈ 7 టిప్స్ ట్రై చేయండి!