అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తగ్గనున్నాయన్న అంచనాల మధ్య స్టాక్ మార్కెట్లు పుంజుకున్నాయి. ఇరాన్ సాంస్కృతిక ప్రదేశాలపైనా దాడి చేస్తామన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలను పెంటగాన్ ఖండించిన నేపథ్యంలో మదుపరులు కొనుగోళ్లకు మొగ్గు చూపారు. దీంతో ఓ దశలో 553 పాయింట్లు ఎగబాకిన బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ సెన్సెక్స్... చివరకు 193 పాయింట్లు లాభపడి 40,869.47 వద్ద ముగిసింది.
జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ నిఫ్టీ సైతం 60 పాయింట్లు ఎగబాకి 12,052.95 వద్ద స్థిరపడింది.
అయితే 2020 ఆర్థిక సంవత్సరానికి జీడీపీ అంచనాలు వెలువడనున్న నేపథ్యంలో మదుపర్లు కాస్త ఆచితూచి వ్యవహరించినట్లు తెలుస్తోంది.
లాభాల్లోని షేర్లు
సెన్సెక్స్ షేర్లలో అల్ట్రాటెక్ సిమెంట్ అత్యధికంగా 2.10 శాతం వృద్ధి చెందింది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్, సన్‌ఫార్మా, ఎన్టీపీసీ, ఏషియన్ పెయింట్స్ లాభాలు గడించాయి.
నష్టాల్లోని షేర్లు
ఇన్ఫోసిస్, ఐసీఐసీఐ బ్యాంక్, భారతీ ఎయిర్టెల్ నెస్లే ఇండియా, హీరో మోటోకార్ప్, పవర్‌గ్రిడ్ షేర్లు నష్టాలు చవిచూశాయి.
ముడి చమురు
ముడి చమురు ధరలు సైతం 0.26 శాతం తగ్గి 68.73 అమెరికా డాలర్లకు చేరింది.
రూపాయి మారకం
అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ పెరిగింది. డాలర్‌పై 10 పైసలు బలపడి 71.83కి చేరింది.
ఆసియా మార్కెట్లు
మరోవైపు అంతర్జాతీయంగా వీచిన సానుకూల పవనాలతో ఆసియా మార్కెట్లు సైతం భారీ లాభాలు ఆర్జించాయి. షాంఘై, హాంకాంగ్, టోక్యో, సియోల్ స్టాక్ మార్కెట్లు రికార్డు స్థాయి లాభాల్లో ముగిశాయి.