Gold prices may skyrocket: రష్యా- ఉక్రెయిన్ మధ్య ఉద్రిక్తతలు, డాలర్‌తో పోలిస్తే రూపాయి మారక విలువ పడిపోవడం, అంతర్జాతీయ మార్కెట్‌లో పసిడి ధర పెరుగుదల తదితర పరిణామాలు దేశీయ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు మళ్లీ భగ్గుమనేలా చేస్తున్నాయి. ఇప్పటికే పసిడి రూ.50 వేల స్థాయిని అధిగమించింది. పది గ్రాముల మేలిమి బంగారం ధర రూ.50,123గా ఉంది. గత ఏడాది కాలంలో ఇదే గరిష్ఠస్థాయి. అటు, కిలో వెండి ధర రూ.63,896కు పెరిగింది.
Russia Ukraine crisis effect on Gold
రష్యా- ఉక్రెయిన్ మధ్య యుద్ధవాతావరణం కారణంగా అంతర్జాతీయ కమోడిటీ మార్కెట్లో ఔన్స్ బంగారం 1,900 డాలర్లకు ఎగబాకింది. వెండి 23.95 డాలర్లకు పెరిగింది. అంతర్జాతీయంగా పసిడి ధరలు గరిష్ఠ స్థాయిల వద్ద స్వల్పకాలిక దిద్దుబాటుకు లోనైనప్పటికీ మళ్లీ ర్యాలీ తీయనున్నాయని బులియన్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
మూడో అతిపెద్ద ఉత్పత్తిదారు రష్యా..
రష్యా- ఉక్రెయిన్ ఉద్రిక్తతలకు ఇప్పట్లో తెరపడే అవకాశాలు కన్పించడం లేదు. వచ్చే 3-4 నెలల్లో ఔన్స్ బంగారం 2 వేల డాలర్లకు చేరుకునే అవకాశాలున్నాయని, ఎంసీఎక్స్‌లో తులం మేలిమి బంగారం రూ.52 వేలపైకి ఎగబాకవచ్చని బులియన్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ ఏడాది ద్వితియార్ధంలో 10 గ్రాముల మేలిమి బంగారం ధర రూ.55 వేలను దాటే అవకాశం ఉందని తెలిపారు.
పసిడి ఉత్పత్తిలో ఆస్ట్రేలియా, చైనా తర్వాత రష్యా మూడో అతిపెద్ద దేశం. ఉక్రెయిన్‌పై యుద్ధానికి దిగితే రష్యాపై అమెరికా, నాటో వాణిజ్య పరమైన ఆంక్షలు విధించనున్నాయి. ఫలితంగా అంతర్జాతీయ మార్కెట్‌కు రష్యా నుంచి బంగారంతో పాటు పలు లోహాల సరఫరాలో అవాంతరాలు ఏర్పడవచ్చన్న ఆందోళనలున్నాయి. ఈ కారణంగానే బంగారం, వెండికి గత కొన్ని రోజుల్లో డిమాండ్ అనూహ్యంగా పెరిగింది.
ఇదీ చదవండి: ఎన్నికల తర్వాత బాదుడే.. పెట్రోల్ ధర ఒకేసారి రూ.8 పెంపు!