కరోనా భయాలతో దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో ట్రేడవుతున్నాయి. బీఎస్ఈ-సెన్సెక్స్ 1680 పాయింట్లకు పైగా కోల్పోయి 47,902 వద్ద కొనసాగుతోంది. ఎన్ఎస్ఈ- నిఫ్టీ 516 పాయింట్లకు పైగా నష్టపోయి 14,312 వద్ద ట్రేడవుతోంది. ఈ స్థాయి నష్టాలకు కారణాలు ఇలా ఉన్నాయి.
- దేశీయంగా కరోనా కేసులు భారీస్థాయిలో వెలుగు చూడడం మదుపరులను ఆందోళనకు గురిచేస్తోంది.
- చాలా నగరాల్లో కరోనా ఆంక్షలను కఠినతరం చేయడంతో వ్యాపారాలపై మళ్లీ ప్రభావం చూపిస్తుందనే భయాలు మార్కెట్లను వెంటాడుతున్నాయి.
- దేశ జీడీపీలో 13 శాతం వాటా ఉన్న మహారాష్ట్రలో పరిస్థితి ఆందోళనకరంగా ఉండటమూ ఓ కారణం.
- అంతర్జాతీయంగా కూడా పెరుగుతోన్న కరోనా కేసులు విదేశీ సంస్థాగత మదుపరులను వెనకడుగు వేసేలా చేస్తున్నాయి.
- ఫిబ్రవరి నెల పారిశ్రామికోత్పత్తి గణాంకాలు విడుదల కూడా నష్టాలకు మరో కారణంగా తెలుస్తోంది.
- మార్చి నెల సీపీఐ ద్రవ్యోల్బణ గణాంకాలు కూడా సోమవారమే వెల్లడి కానుండటంతో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా ఉన్నారు.
- భారీ నష్టాలతో బీఎస్ఈ మదుపరుల సంపద (మిడ్ సెషన్ ముందు వరకు) రూ.6.86 లక్షల కోట్లు ఆవిరైంది.
- మార్కెట్లకు ఊతం ఇచ్చే అంశం ఒక్కటి కూడా లేకపోవడం నష్టాలకు ప్రధాన కారణంగా చెప్పవచ్చు.
ఇదీ చూడండి: గంటలో రూ.6.86 లక్షల కోట్ల సంపద ఆవిరి!