Rakesh Jhunjhunwala Portfolio: స్టాక్‌మార్కెట్ కుప్పకూలడం మదుపర్లకు తీవ్ర నష్టాన్ని మిగల్చింది. బిగ్ బుల్గా పేర్కొనే దిగ్గజ మదుపరి రాకేశ్ ఝున్‌ఝన్‌వాలా కూడా ఇందుకు మినహాయింపు కాదు. ఆయన పెట్టుబడి పెట్టిన టైటాన్, టాటా మోటార్స్ సంస్థల షేర్లు కుదేవలడం భారీ నష్టాన్ని కలిగించింది. కేవలం 10 నిమిషాల్లో ఝన్ఝున్వాలాకు చెందిన దాదాపు రూ.230 కోట్ల సంపద ఆవిరైంది.
నష్టాల్లోకి ఇలా..
మార్కెట్ ప్రారంభ సమయానికి టైటాన్ సంస్థ షేర్ విలువ రూ.22.70 నష్టంతో రూ.2280.40గా ఉండేది. కానీ కాసేపటికే షేర్ విలువ రూ.2241.10కి చేరుకుంది. దీంతో కేవలం 10 నిమిషాల్లోనే షేర్‌కు రూ. 39.30 చొప్పున తగ్గిపోయింది.
టైటాన్లో రాకేశ్‌కు 3,37,60,395 షేర్లు ఉండగా ఆయన సతీమణి రేఖా ఝున్‌ఝున్‌వాలా 95,40,575 షేర్లు కొనుగోలు చేశారు. వీరిద్దరికీ కలిపి మొత్తం 4,33,00,970 షేర్లు ఉన్నాయి.
అదే విధంగా స్టాక్‌మార్కెట్ ప్రారంభమయ్యే సమయానికి టాటా మోటార్స్ సంస్థ షేర్ విలువ రూ. 10.30 నష్టంతో రూ.470.20గా ఉండేది. కానీ పది నిమిషాల్లో షేర్‌కు రూ.15.90 తగ్గి ఈ విలువ రూ. 454.30కు చేరుకుంది. టాటా మోటార్స్‌లో రాకేశ్‌కు 3,67,50,000 షేర్లు ఉన్నాయి.
మార్కెట్ దెబ్బకు రాకేశ్‌కు చెందిన రూ.170 కోట్లు (టైటాన్), రూ.60 కోట్లు (టాటా మోటార్స్) సంపదకు గండి పడింది.
అయితే ఈ స్టాక్స్.. మార్కెట్ ముగిసే సమయానికి కోలుకునే అవకాశం ఉందంటున్నారు నిపుణులు. 'టైటాన్ స్టాక్స్ విలువ ప్రస్తుతం రూ.2150 నుంచి రూ.2300 మధ్య ఉన్నాయి. ఇవి రూ.2300 దాటితే కోలుకునే అవకాశం ఉంటుంది. టాటా మోటార్స్ షేర్ల విలువ కూడా రూ.460 దాటితే మళ్లీ పుంజుకునే అవకాశం ఉంది' అని పేర్కొన్నారు.
ఇదీ చూడండి : మార్కెట్లపై బేర్ పంజా.. సెన్సెక్స్ 1000 పాయింట్లు డౌన్