NSE Technical Glitch: దేశీయ ప్రధాన స్టాక్ ఎక్స్ఛేంజీల్లో ఒకటైన ఎన్‌ఎస్‌ఈలో మరోసారి సాంకేతిక సమస్య తలెత్తింది. సోమవారం ట్రేడింగ్ ప్రారంభమైన కాసేపటికే కొన్ని స్టాక్ ధరలు తెరపై అప్‌డేట్ కాలేదని పలు బ్రోకరేజీ సంస్థలు ఎక్స్ఛేంజీ దృష్టికి తీసుకొచ్చాయి. నిఫ్టీ సహా మరికొన్ని ఇండెక్స్‌ల ధరలు సైతం తెరపై కనిపించలేదని పేర్కొన్నాయి. ఏడాది క్రితం కూడా ఇలాంటి సమస్యే ఎదురైన విషయం తెలిసిందే. గత ఏడాది ఫిబ్రవరి 24న భారీ సాంకేతిక సమస్య తలెత్తడం వల్ల ఏకంగా ఎక్స్ఛేంజీని 4 గంటలపాటు మూసివేయాల్సి వచ్చింది. తాజా సమస్యతో మరోసారి ఎన్‌ఎస్‌ఈ వినియోగిస్తున్న సాంకేతికత, ఆటోమేషన్‌పై అనుమానాలు రేకెత్తుతున్నాయి.
ఎన్‌ఎస్‌ఈ ఏమందంటే..
సమస్యను ధ్రువీకరించిన ఎన్‌ఎస్‌ఈ.. దాన్ని పరిష్కరించినట్లు ట్విట్టర్ వేదికగా వెల్లడించింది. నిఫ్టీ, బ్యాంక్‌నిఫ్టీలో అప్పుడప్పుడు ధరలు తెరపై అప్‌డేట్ కాలేదని తెలిపింది. దాన్ని పరిష్కరించామని ప్రస్తుతం అన్ని సూచీలు సాధారణంగానే పనిచేస్తున్నాయని వివరణ ఇచ్చింది.
ఆర్డర్లు మాత్రం ఎగ్జిక్యూట్ అయ్యాయి..
సమస్య తలెత్తినప్పుడు ధరలు మాత్రమే అప్‌డేట్ కాలేదని పలు బ్రోకరేజీ సంస్థలు తెలిపాయి. ఆర్డర్లు మాత్రం ఎగ్జిక్యూట్ అయ్యాయని పేర్కొన్నాయి. అలాగే డెరివేటివ్స్ విభాగం సైతం సాధారణంగానే పనిచేసిందన్నాయి. కో-లొకేషన్ ప్రాగ్జిమిటీ సర్వర్లు కూడా ఈ సమస్యను ఎదుర్కొన్నాయా.. లేదా కేవలం నాన్ కో-లొకేషన్ ట్రేడర్లు మాత్రమే ఇబ్బంది పడ్డారా విచారించాలని విజ్ఞప్తి చేశాయి.
విచారణ జరిపించాల్సిందే..
ఎన్‌ఎస్‌ఈ సర్వర్ సాంకేతికతపై పూర్తిస్థాయి విచారణ జరిపించాల్సి ఉందని పలువురు బ్రోకర్లు డిమాండ్ చేశారు. క్యాష్ మార్కెట్లలో ఏదైనా సమస్య తలెత్తితే ఆ ప్రభావం డెరవేటివ్ మార్కెట్లపై కూడా ఉండాలన్నారు. కానీ, ప్రస్తుతం తలెత్తిన సమస్య అందుకు భిన్నంగా ఉందన్నారు. ఒక దాంట్లో సమస్య వస్తే ఆటోమేటిక్‌గా మరో దాంట్లో కూడా అది కనిపించాలన్నారు. లేకపోతే ట్రేడర్లకు స్టాక్ ధరల విషయంలో గందగరోళం తలెత్తే ప్రమాదం ఉందన్నారు.
ఇవీ చూడండి:
చమురు ధరలకు రెక్కలు.. కుప్పకూలిన దేశీయ మార్కెట్లు