భారత స్టాక్ మార్కెట్ల దూకుడును 50 ఏళ్ల ర్యాలీగా ప్రముఖ మదుపరి మార్క్ మొబియస్ అభివర్ణించారు. 10 ఏళ్ల క్రితం చైనా మార్కెట్లలో ఉన్న పరిస్థితి.. ఇప్పుడు భారత్ మార్కెట్లలో కన్పిస్తోందని తాను భావిస్తున్నట్లు చెప్పారు. మొబియస్ నెలకొల్పిన మొబియస్ కేపిటల్ పార్ట్‌నర్స్ ఎల్‌ఎల్‌పీ.. మొబియస్ ఎమర్జింగ్ మార్కెట్స్ ఫండ్‌లో 45 శాతం పెట్టుబడులను ఇండియా, తైవాన్ మార్కెట్లకు కేటాయించింది. హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్ రంగాల్లో అత్యధికంగా పెట్టుబడులు పెట్టింది. చైనా మార్కెట్లలో నష్టాలను పరిమితం చేసుకునేందుకు, వర్ధమాన మార్కెట్లకు సంబంధించి తన పెట్టుబడుల్లో దాదాపు సగాన్ని భారత్, తైవాన్ మార్కెట్లలో ఆయన పెట్టారు. సెప్టెంబరు చివరికి మొబియస్‌కు అత్యధిక పెట్టుబడులు ఉన్న సంస్థల్లో భారత్‌కు చెందిన సాఫ్ట్‌వేర్ సేవల సంస్థ పర్సిస్టెంట్ సిస్టమ్స్, తైవాన్‌కు చెందిన చిప్ టెక్నాలజీ సంస్థ ఇమెమొరీ టెక్నాలజీ ఇంక్ ఉన్నాయి. ఈ ఏడాది ఈ రెండు కంపెనీల షేర్లు రెట్టింపునకు పైగా రాణించాయి. చైనా ఈక్విటీల నేలచూపులు భారత్ స్టాక్ మార్కెట్‌కు అవకాశాలను సృష్టిస్తాయని మొబియస్ పేర్కొన్నారు. 'చైనా మార్కెట్ల నష్టాలను ఆధారం చేసుకుని వర్ధమాన మార్కెట్ల పరిస్థితి బాగోలేదని అనుకుంటున్నారు. కానీ.. భారత్ లాంటి ఇతర వర్ధమాన దేశాల స్టాక్ మార్కెట్లు రాణిస్తున్న విషయాన్ని వాళ్లు చూడటం లేద'ని మొబియస్ వివరించారు. రాష్ట్రాల వ్యాప్తంగా ఒకే తరహా ప్రభుత్వ విధానాలు దీర్ఘకాలంలో దేశానికి ప్రయోజనాన్ని కలిగిస్తాయని వివరించారు.
భారత స్టాక్ మార్కెట్లపై మొబియస్ వైఖరి మోర్గాన్ స్టాన్లీ, నొమురా హోల్డింగ్స్ విశ్లేషకుల అంచనాలకు భిన్నంగా ఉండటం గమనార్హం. 2020 మార్చి కనిష్ఠ స్థాయిల నుంచి దేశీయ సూచీలు రెట్టింపు స్థాయిలో పెరిగినప్పటికీ.. మోర్గాన్ స్టాన్లీ, నొమురాలు భారత స్టాక్ మార్కెట్ ర్యాంకును తగ్గించాయి.
ఇదీ చూడండి: సరఫరా స్తంభిస్తే ఇక్కట్లే- గాడిన పడేదెలా?