గత కొన్ని నెలలుగా దేశవ్యాప్తంగా చిన్న కంపెనీల్లో ఐపీఓ(ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్)పై ఆసక్తి పెరిగింది. ఈ ఒక్క వారమే ఐదు కంపెనీలు ఐపీఓకు రానుండటం ఇందుకు నిదర్శనం. దాదాపు రూ.3,764 కోట్లు సమీకరించాలన్నది ఈ సంస్థల లక్ష్యం.
రిటైల్ మదుపరులకు వాటాల విక్రయం ద్వారా మరింత బలంగా తయారవ్వాలనే ఉద్దేశంతో ఆయా కంపెనీలు ఐపీఓపై ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది.
ఐపీఓకు రానున్న కంపెనీలు ఇవే..
- లక్ష్మీ ఆర్గానిక్ ఇండస్ట్రీస్ షేర్ల విక్రయం 15 నుంచి 17వ తేదీ వరకు కొనసాగనుంది. ఈ ఆఫర్ ద్వారా రూ.600 కోట్లు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది ఆ కంపెనీ.
- వాహన పరికరాల తయారీ కంపెనీ క్రాఫ్ట్స్‌మన్ ఆటోమేషన్ లిమిటెడ్ కూడా 15 నుంచి 17 వరకు ఐపీఓకు అందుబాటులో ఉండనుంది. ఐపీఓ ద్వారా కొత్తగా రూ.150 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయానికి ఉంచనునంది కంపెనీ. దీనితోపాటు వాటాదార్లకు చెందిన 45,21,450 షేర్లను ఆఫర్ ఫర్ సేల్ కింద విక్రయానికి ఉంచనుంది.
- కల్యాణ్ జువెలర్స్.. 16వ తేదీన ఐపీఓకు రానుంది. 18 వరకు అందుబాటులో ఉంటుంది. ప్రతిపాదిత ఇష్యూ ద్వారా రూ.1,175 కోట్లు సమీకరించాలని కంపెనీ భావిస్తోంది. ఇందులో భాగంగా రూ.800 కోట్ల విలువైన కొత్త షేర్లను, ఆఫర్ ఫర్ సేల్ ద్వారా రూ.375 కోట్లు విలువైన షేర్లను కంపెనీ విక్రయించనుంది.
- సూర్యోదయ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ (ఎస్‌ఎఫ్‌బీ) పబ్లిక్ ఇష్యూ ఈ నెల 17న ప్రారంభమై 19న ముగియనుంది. దీని ద్వారా రూ.600 కోట్లు మేర సమీకరించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. ప్రతిపాదిత ఐపీఓలో రూ.250 కోట్ల విలువైన తాజా షేర్లతో పాటు ప్రస్తుత ప్రమోటర్లు, వాటాదార్లకు చెందిన రూ.350 కోట్లు విలువైన షేర్లను ఆఫర్ ఫర్ సేల్ పద్ధతిలో విక్రయించనుంది.
- నజారా టెక్నాలజీస్.. బిగ్బుల్ రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా పెట్టుబడులున్న ఈ గేమింగ్ సంస్థ ఐపీఓ కూడా 17న ప్రారంభమై.. 19న ముగియనుంది. రాకేశ్ ఝున్‌ఝున్‌వాలాకు ఈ కంపెనీలో 11.51 శాతం వాటా ఉంది. ఆయన తప్ప మిగతా వాటాదార్లంతా ఐపీఓ ద్వారా తమ వాటాల్లో కొంత విక్రయించనున్నారు.
ఇదీ చదవండి:ఫెడ్ నిర్ణయాలు, ఆర్థిక గణాంకాలే మార్కెట్లకు కీలకం!