ఈ వారం స్టాక్మార్కెట్లపై కేంద్ర బడ్జెట్ అధికంగా ప్రభావం చూపే అవకాశం ఉంది. భారతీయ రిజర్వు బ్యాంక్(ఆర్బీఐ) ద్రవ్య పరపతి విధానం, కంపెనీల మూడో త్రైమాసిక ఫలితాలు సైతం మార్కెట్ల సరళిని నిర్ణయించే అవకాశం ఉన్నట్లు నిపుణులు విశ్లేషిస్తున్నారు.
వృద్ధి మెరుగుదల సహా ద్రవ్య క్రమశిక్షణ పాటించడం వంటి అంశాల్లో మదుపరుల అంచనాలు అందుకోవడంలో బడ్జెట్ విఫలమైందని విశ్లేషకులు చెబుతున్నారు. నూతన ఆదాయ పన్ను విధానంలో.. పన్ను మినహాయింపు పొదుపు పథకాలపై తీసుకున్న నిర్ణయంతో మార్కెట్లపై ప్రతికూల ప్రభావం పడుతుందని భావిస్తున్నారు.
2020 ఆర్థిక సంవత్సరానికి ద్రవ్య లోటును సవరించడం మంచి పరిణామమని జియోజిట్ ఫైనాన్సియల్ సర్వీసెస్‌కు చెందిన వినోద్ నాయర్ అభిప్రాయపడ్డారు. అయితే 2021 లోనూ ఇదే విధానాన్ని కొనసాగిస్తే మార్కెట్లకు నూతన బలం చేకూరుతుందని అభిప్రాయపడ్డారు.
"ఆదాయపన్ను మినహాయింపు పథకాలు తొలగించి.. పన్ను విధానంలో మార్పులు చేయడం మార్కెట్లను నిరాశకు గురి చేసింది. ప్రస్తుతం మూడో త్రైమాసిక ఫలితాలు, అంతర్జాతీయ పరిణామాలపైకి మార్కెట్ల దృష్టి మరలే అవకాశం ఉంది."
-వినోద్ నాయర్, జియోజిట్ ఫైనాన్సియల్ సర్వీసెస్
బడ్జెట్ తర్వాత తొలి ద్వైమాసిక ద్రవ్య పరపతి విధానాన్ని ఆర్బీఐ గురువారం ప్రకటించనుంది. ద్రవ్యపరపతిలో వెలువడే అంశాలు కూడా మదుపర్లపై ప్రభావం చూపనున్నట్లు నిపుణులు స్పష్టం చేస్తున్నారు. దీనితో పాటు కరోనా వైరస్ భయాలూ మార్కెట్ సెంటిమెంట్లపై ప్రభావం చూపనున్నట్లు తెలుస్తోంది.
ఇదీ చదవండి: 2020-21లో చమురు సంస్థల పెట్టుబడుల్లో భారీ వృద్ధి