దేశాభివృద్ధిలో వైద్య రంగానిది ముఖ్యభూమిక. అలాంటి రంగానికి మోదీ 2.0 ప్రభుత్వం బడ్జెట్లో ఏ స్థాయిలో కేటాయింపులు చేస్తుందన్న చర్చ సర్వత్రా జరుగుతోంది.
కేటాయింపుల్లో చిన్నచూపు...
భారత్... జీడీపీలో సుమారు 1.4 శాతాన్ని వైద్యరంగానికి కేటాయిస్తోంది. చిన్నదేశాలు శ్రీలంక (1.6%), భూటాన్ (2.5%) ఆరోగ్యరంగ కేటాయింపుల్లో మనకంటే ముందున్నాయి.
కాస్త మెరుగు...
2019-20 మధ్యంతర బడ్జెట్ ప్రవేశ పెట్టిన మోదీ 1.0 ప్రభుత్వం వైద్యరంగానికి కేటాయింపులు కాస్త పెంచింది. రూ. 61,398 కోట్లు కేటాయించింది. ఇది అంతకుముందు ఏడాది కన్నా 16.3% ఎక్కువ.
సమానత్వం...
ఆరోగ్యరంగ కేటాయింపుల్లో సమానత్వం అవసరం. ఉదాహరణకు 'ఆయుష్మాన్ భారత్'కు మధ్యంతర బడ్జెట్లో కేటాయింపులు గణనీయంగా పెరిగాయి. అంతకుముందు ఏడాది కంటే 166 శాతం కేటాయింపులు పెచ్చింది సర్కారు.
అయితే గాయాలు, జాతీయ క్యాన్సర్ నివారణ కార్యక్రమం, మధుమేహం వంటి వాటిని కేటాయింపుల్లో చిన్నచూపు చూశారు. కానీ వీటికి అధిక ప్రాధాన్యం అవసరం.
ఆయుష్మాన్ భారత్‌తో సమానంగా ఇతర ఆరోగ్య పథకాలకు కేటాయింపులు జరపడం ముఖ్యం.
వసతుల లేమి..
ప్రపంచంలోనే రెండో అత్యధిక జనాభా కలిగిన భారత్‌లో ఆసుపత్రి వసతుల లేమి తీవ్రంగా ఉంది. 2016-గ్రామీణ ఆరోగ్య గణాంకాల ప్రకారం దేశంలో...
- ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు 22 శాతం తక్కువగా ఉన్నాయి.
- ఆరోగ్య ఉపకేంద్రాలు 20% తక్కువ.
- కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రాలు 30 శాతం తక్కువ.
జనాభా-వైద్యుడి నిష్పత్తి...
ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పిన సూచనల ప్రకారం ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉండాల్సిన జనాభా-వైద్యుడి నిష్పత్తి.. భారత్‌లో 25 రెట్లు లోటులో ఉంది.
భారీ కేటాయింపులు అవసరం...
దేశంలో వైద్యరంగం అభివృద్ధి చెందాలంటే బడ్జెట్లో భారీ కేటాయింపులు తప్పనిసరి. కేటాయింపులతో పాటు స్థిరమైన పర్యవేక్షణ కావాలి. గర్భిణి, శిశువుల మరణాల శాతాన్ని తగ్గించే చర్యలపైనా దృష్టి పెట్టాలి. పేద దేశాలైన రువాండా, ఇథియోపియా ఈ అంశంపై ప్రత్యేక దృష్టి పెట్టాయి. తక్కువ ఖర్చుతో మెరుగైన ఫలితాలు సాధించాయి.
సిబ్బందికి ప్రోత్సాహకాలు...
రువాండాలో ఆర్యోగ కేంద్రాల ఉద్యోగులకు ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇస్తుంది ప్రభుత్వం. కచ్చితమైన ఆరోగ్య మార్గదర్శకాలు పాటించిన కేంద్రాలను ప్రోత్సహిస్తోంది. ప్రజల్లో ఆరోగ్యం పట్ల అవగాహన కార్యక్రమాలు చేపడుతోంది.
ఆదర్శంగా ఇథియోపియా...
ఇథియోపియా వైద్యరంగంలో ప్రమాణాలు పెంచుకోవడానికి తీవ్రంగా కృషి చేస్తోంది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సిబ్బంది భర్తీ కోసం గ్రామీణ స్థాయిలో పట్టభద్రులకు ఏడాది పాటు ప్రత్యేక శిక్షణ ఇచ్చింది. అనంతరం వారికి ఉద్యోగాలు కల్పించింది. ఈ చర్యల వల్ల శిశు మరణాలు 32% తగ్గాయి. గర్భిణీ మృతుల సంఖ్య 38% తగ్గింది.
ఇలాంటి వాటిపై ప్రభుత్వం దృష్టి పెట్టి, తగిన స్థాయిలో నిధులు కేటాయిస్తే... దేశం నిజంగానే ఆయుష్మాన్ భారత్‌గా మారే అవకాశం ఉంది.
- ఇదీ చూడండి: పద్దు 2019: పన్ను పరిమితి పెరిగేనా..?