ఆదాయ పన్ను రీఫండ్‌పై వడ్డీ రాలేదని చాలా మంది ఆర్థిక నిపుణులను సంప్రదిస్తారు. నిబంధనల ప్రకారం, పన్ను చెల్లింపుదారుడు రీఫండ్‌పై వడ్డీకి అర్హులు. కానీ అన్నింటికీ కాదు. మరి ఎప్పుడు మీకు రీఫండ్‌పై వడ్డీ లభిస్తుందో తెలుసుకోవడం ముఖ్యం.
ఒకవేళ ఆర్థిక సంవత్సరానికి టీడీఎస్, టీసీఎస్, అడ్వాన్స్ ట్యాక్స్ రూపంలో మీరు చెల్లించాల్సిన పన్ను కంటే ఎక్కువ చెల్లిస్తే మీరు పన్ను రీఫండ్ కోసం అర్హులు. నిర్ణీత సమయం లోపు ఐటీఆర్ దాఖలు చేయడం ద్వారా ఈ రీఫండ్ క్లెయిమ్ చేసుకోవచ్చు. ఐటీఆర్‌ను ప్రాసెస్ చేసిన తర్వాత రీఫండ్ లభిస్తుంది.
వడ్డీ లభించే సందర్భాలు..
అయితే, రీఫండ్ మొత్తం నిర్ణయించిన పన్నులో 10 శాతం కన్నా తక్కువ ఉంటే వడ్డీ లభించదు. ఉదాహరణకు, ఒక వ్యక్తి పన్ను చెల్లించాల్సిన ఆదాయం రూ.5,48,000, టీడీఎస్ రూ.5,98,000 . రీఫండ్ రూ.50,000 ఐటీఆర్ దాఖలు చేసే సమయంలో క్లెయిమ్ చేసుకోవాలి. అయితే ఇక్కడ రీఫండ్ 10 శాతం కంటే తక్కువ కాబట్టి దానిపై వడ్డీ లభించదు. పది శాతం కంటే ఎక్కువగా ఉంటే వడ్డీ చెల్లిస్తారు.
ఏప్రిల్ 1 నుంచి లెక్కింపు..
ఒకవేళ రీఫండ్ పరిమితికి మించి ఉంటే, పన్ను చెల్లింపుదారునికి తగిన వడ్డీ లభిస్తుంది. ఒక ఆర్థిక సంవత్సరంలో చెల్లించిన టీడీఎస్, టీసీఎస్ లేదా అడ్వాన్స్ టాక్స్ నుంచి రీఫండ్ లభిస్తే, ప్రతి నెల లేదా నెలలో కొంత భాగానికి 0.5 శాతం చొప్పున వడ్డీ లెక్కింపు మదింపు సంవత్సరం ఏప్రిల్ నుంచి ప్రారంభమవుతుంది. నిర్ణీత తేదీన లేదా అంతకు ముందే ఐటీఆర్ దాఖలు చేస్తే, మదింపు సంవత్సరంలో ఏప్రిల్ 1 నుంచి రీఫండ్ జారీ చేసిన తేదీ వరకు వడ్డీ లెక్కించాలి. పన్నురీఫండ్ నిర్ణీత తేదీకి ఇవ్వకపోతే, రీఫండ్ చేసిన తేదీ వరకు వడ్డీ లభిస్తుంది.
ఇదీ చదవండి:'19 రోజుల్లో రూ.5,649 కోట్ల పన్ను రీఫండ్'