సొంతింటి కల నెరవేర్చుకునేందుకు ప్రస్తుతం గృహ రుణం అనేది సర్వ సాధారణమైంది. నెలనెలా ఈఎంఐలు చెల్లిస్తూ.. జీవితంలో అధిక భాగం రుణం తీర్చేందుకే కష్టపడుతుంటారు.
అనుకోని పరిస్థితుల్లో గృహ రుణం తీసుకున్న వారు మరణిస్తే లేదా సంపాదించలేని పరిస్థితి వస్తే.. ఈఎంఐల భారం కుటుంబంపై పడుతుంది. ఈఎంఐలు చెల్లించకుంటే.. ఇంటిని వదులు కోవాల్సి ఉంటుంది. ఈ పరిస్థితి రాకుండా.. సమగ్ర గృహ రుణ బీమా ద్వారా భరోసా పొందొచ్చు. వ్యక్తిగత బీమా కూడా ఇంటికి కవరేజీ ఇస్తుంది. ఈ బీమాకు చెల్లించిన ప్రీమియాల ద్వారా పన్ను ప్రయోజనాలు కూడా పొందవచ్చు.
ఎందుకు అవసరం?
రుణం తీసుకున్న వ్యక్తి అనుకోకుండా మరణించినట్లయితే బ్యాంకులు నష్టపోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా రుణం తీసుకున్న వ్యక్తి ఒక్కడే కుటుంబంలో సంపాదించే వ్యక్తి అయినట్లయితే బ్యాంకులు అధికంగా నష్టపోవాల్సి ఉంటుంది. కాబట్టి ఈ బీమా ఉంటే బ్యాంకులు కూడా నష్టం నుంచి తప్పించుకోవచ్చు.
గృహ రుణ బీమా ద్వారా కేవలం గృహ రుణానికి సంబంధించిన అవుట్ స్డాండింగ్ కవరేజీ లభిస్తుంది. గృహ రుణ బీమాలో కవరేజీ క్రమక్రమంగా తగ్గతూ ఉంటుంది. ఈ కవరేజీ గృహ రుణం అవుట్ స్టాండింగ్ పైన ఆధారపడి ఉంటుంది. అంటే రుణం చెల్లిస్తున్న కొద్దీ ఆ మేరకు కవరేజీ తగ్గుతుందన్న మాట.. గృహ రుణ బీమాలో బీమా సంస్థ బ్యాంకుకు రుణ సెటిల్మెంట్ కోసం చెల్లింపు చేస్తుంది.
ఈ బీమాను జనరల్ లేదా జీవిత బీమా సంస్థల నుంచి తీసుకోవచ్చు. జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీల నుంచి తీసుకున్న వాటిని ప్రతి ఏడాది రిన్యూవల్ చేసుకోవాల్సి ఉంటుంది. అదే జీవిత బీమా సంస్థల నుంచి అయితే దీర్ఘకాలంతో బీమా పొందవచ్చు.
ఇవి గమనించండి..
రైడర్లు, యాడ్-ఆన్ల గురించి తప్పకుండా తెలుసుకోవాలి. నిరుద్యోగం, వైకల్యం వంటి పరిస్థితులను కవర్ చేసే ప్రణాళికను పొందడం ఉత్తమం. సహజ మరణం, ప్రమాదం ద్వారా మరణాలకు కవరేజీ ఉంటుందా? లేదా? తెలుసుకోవాలి.
రుణం పూర్తిగా చెల్లించేందుకు ఉండే గడువు, బీమా వ్యవధి రెండు సమానంగా ఉండాలి. స్వల్ప కాలం కోసం తీసుకుని, తర్వాత పొడగించుకుందామని కొందరు అనుకుంటుంటారు. అయితే కొంత కాలం తర్వాతా పాలసీ ప్రీమియం ఎక్కువగా ఉండవచ్చు.
మార్కెట్లో ఉన్న పలు పాలసీలను పోల్చి చూసుకుని బీమాపై అంతిమ నిర్ణయం తీసుకోవటం ఉత్తమం.
దాదాపు సింగిల్ ప్రీమియం పాలసీలే
గృహ రుణ ప్రొటెక్షన్ ప్లాన్లకు దాదాపు సింగిల్ ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. అయితే ప్రీమియం ఎక్కువున్న దృష్ట్యా.. బ్యాంకులు దీనిని రుణ మొత్తానికి కలిపి రుణ స్వీకర్త నుంచి రుణ ఈఎంఐ ద్వారా పొందుతుంటాయి.
ఉదాహరణకు.. రూ. 45 లక్షల గృహ రుణం తీసుకున్నట్లయితే, రూ.2 లక్షల గృహ రుణ బీమా ఉందనుకుందాం. రూ.2 లక్షలను అసలుకు కలిపి రూ. 47 లక్షలపై ఈఎంఐని గణిస్తాయి బ్యాంకులు లేదా ఫినాన్స్ కంపెనీలు.
ఎక్కువగా గృహ రుణ ప్రొటెక్షన్ ప్లాన్లు అవుట్ స్టాండింగ్పై కవరేజీ అందిస్తాయి. అంటే రుణం మొత్తం చెల్లించిన అనంతరం బీమా కూడా ముగుస్తుంది. బీమా కవరేజీ పరిధి విస్తరించుకునేందుకు టర్మినల్ ఇల్ నెస్, ప్రమాదంలో మరణం, ఉద్యోగం లేని సందర్భంలో మూడు నుంచి ఆరు నెలల ఈఎంఐ చెల్లించటం, వైకల్యం లాంటి రైడర్లను తీసుకోవచ్చు.
గృహ రుణ బీమాను.. హోం లోన్ ఉన్న వారు లేదా కొత్తగా తీసుకుంటున్న వారు ఇద్దరూ తీసుకోవచ్చు. గృహ రుణ బీమా తప్పనిసరిగా తీసుకోవాలన్నది లేదు.
సాధారణ టర్మ్ బీమా..
టర్మ్ పాలసీలు కూడా తక్కువ ప్రీమియంతో ఎక్కువ కవరేజీని అందిస్తుంటాయి. కాబట్టి వీటిని కూడా కుటుంబం రుణ బాధ్యత నుంచి విముక్తి పొందేందుకు ఉపయోగించుకోవచ్చు.
ఇవీ చదవండి: