బంగాల్లో 7,000 నుంచి 8,000 మంది రైతులు ప్రధాన్‌మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కోసం ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకున్నట్లు కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ తెలిపారు. ఈ పథకం అమలు చేసేందుకు బంగాల్ ప్రభుత్వం నిరాకరించినప్పటికీ ఈ స్థాయిలో దరఖాస్తులు వచ్చాయన్నారు తోమర్.
అయితే బంగాల్లో దరఖాస్తు చేసుకున్న రైతులకు పీఎం-కిసాన్ పథకం లబ్ధిచేకూరదని తోమర్ స్పష్టం చేశారు. సమాఖ్య నిబంధనలను కేంద్రం దాటివేయలేదని పేర్కొన్నారు. లబ్ధిపొందాలంటే రాష్ట్ర ప్రభుత్వం దరఖాస్తు చేసుకున్న రైతులను అర్హులుగా ప్రకటించాల్సిన అవసరముందన్నారు. గతంలోనే ఈ పథకాన్ని అమలు చేయాలని బంగాల్ ప్రభుత్వానికి లేఖ రాసినట్లు తోమర్ గుర్తు చేశారు.
రూ.87,000 కోట్లతో మూడు విడతలుగా ఏడాదికి రూ.6,000 ప్రోత్సాహాన్ని ఇచ్చేందుకు కేంద్రం ఈ పథకాన్ని తీసుకువచ్చింది. ఇందులో భాగంగా వ్యక్తిగతంగా రైతులు తమ పేర్లు నమోదు చేసుకునేందుకు గత నెల పీఎం కీసాన్ పోర్టల్‌నూ ప్రారంభించింది.
ఈ పోర్టల్ ద్వారా దేశవ్యప్తంగా మొత్తం 3లక్షల మంది తమ పేర్లు నమోదు చేసుకోగా.. బంగాల్ నుంచి 7 వేల నుంచి 8 వేల దరఖాస్తులు అందాయి.
ఇదీ చూడండి: నానోకు ఇక టాటా... 9 నెలల్లో ఒకే ఒక్క కారు విక్రయం!