కొవిడ్ రెండో దశ ఉద్ధృతి తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో కేంద్రం మరో ఉద్దీపనను ఆవిష్కరించింది. ఉత్పత్తిని, ఎగుమతుల్ని, ఉపాధి అవకాశాల్ని పెంచే రీతిలో ఆరోగ్యం, సామాజిక, ఆర్థిక రంగాలకు ఊతమిచ్చేందుకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రూ.6,28,993 కోట్ల ప్యాకేజీ ప్రకటించారు. 15 విభాగాల్లో విభిన్న రకాల ఉపశమనాలు ప్రకటించారు. ఇందులో కొన్ని కొత్తవి కాగా, మరికొన్ని పాత పథకాల పొడిగింపులున్నాయి. ఆరోగ్య రంగం బలోపేతం, కొవిడ్ కారణంగా దెబ్బతిన్న రంగాలకు చేయూత, రైతుల ఆదాయం రెట్టింపు, విద్యుత్తు సంస్కరణలు, ఎగుమతుల ప్రోత్సాహం, ఉపాధి కల్పన విభాగాలను దృష్టిలో ఉంచుకొని ‘మహమ్మారి నుంచి ఆర్థిక ఉపశమనం’ పేరుతో మంత్రి ఈ ప్రకటన చేశారు. ఇదివరకే ప్రకటించిన ఎరువుల రాయితీ పెంపు, నవంబరు వరకు పేదలకు ఉచిత తిండి గింజల సరఫరా అంశాలు ఇందులో ఉన్నాయి. అత్యధిక అంశాలు రుణాలకు సంబంధించినవే ఉన్నాయి. కేంద్ర బడ్జెట్ నుంచి నికరంగా ఖర్చు పెట్టేదెంత అన్న ప్రశ్నకు స్పష్టమైన సమాధానం లేదు.
వైద్యానికి పెద్దపీట
కొవిడ్ మూడో ఉద్ధృతిపై అంచనాల నేపథ్యంలో దేశవ్యాప్తంగా అన్ని ఆసుపత్రుల్లో పిల్లలకు సంబంధించిన వైద్యసేవలను విస్తరించేందుకు రూ.23,220 కోట్లను ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఈ నిధులు సిద్ధంగా ఉన్నాయని, ఎంత వేగంగా ఉపయోగించుకుంటారన్నది రాష్ట్ర ప్రభుత్వాల సామర్థ్యంపై ఆధారపడి ఉంటుందని ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి టీవీ సోమనాథన్ పేర్కొన్నారు. కొవిడ్ ప్రభావిత రంగాలకు రూ.1.10 లక్షల కోట్ల రుణ గ్యారంటీ పథకం అమలు చేయనున్నారు. ఇందులో ఒక్క వైద్య ఆరోగ్య రంగానికి రూ.50వేల కోట్లు సమకూరుస్తారు. దేశంలోని 8 ప్రధాన మెట్రోపాలిటన్ నగరాలు మినహా మిగిలిన ప్రాంతాలకు మాత్రమే ఇది వర్తిస్తుంది. దీంతో కలిపి ఆరోగ్య రంగంలో సదుపాయాల అభివృద్ధికి మొత్తం రూ.73,220 కోట్లు సమకూర్చనున్నారు.
- వైద్య సదుపాయాలు విస్తరించని ప్రాంతాల్లో వాటిని కల్పించేవారికి గరిష్ఠంగా రూ.100 కోట్ల చొప్పున రుణం ఇస్తారు. దీనివల్ల ఆంధ్రప్రదేశ్‌లోని కడప, విజయనగరం, విశాఖపట్నం, తెలంగాణలోని ఆసిఫాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, గ్రామీణ వరంగల్ జిల్లాలకు అదనపు ప్రయోజనం కలగనుంది. ఈ రుణాలపై వడ్డీ 7.95శాతం.
- ఆసుపత్రుల్లో పిల్లల వైద్యసేవల కోసం ఐసీయూ పడకలు, ఆక్సిజన్ సరఫరాను పెంచుతారు. అవసరమైనన్ని పరికరాలు, మందులు, టెలి కన్సల్టేషన్, అంబులెన్స్ సేవలు అందుబాటులోకి తెస్తారు.
- కొవిడ్ ప్రభావానికి గురైన వైద్యేతర రంగాలకు రూ.60వేల కోట్ల రుణాలు గ్యారంటీతో అందిస్తారు. వీటిపై వడ్డీ 8.25శాతం ఉంటుంది. గ్యారంటీ లేని సాధారణ రుణాలపై వడ్డీ 10-11శాతం ఉంటుంది.
- రైతులకు అధిక దిగుబడులు ఇచ్చే వంగడాలను పంపిణీచేసి అటు పోషకాహార లోపాన్ని, ఇటు వాతావరణ మార్పుల వల్ల ఎదురయ్యే నష్టాన్ని అధిగమిస్తారు. అన్నింటినీ తట్టుకొని నిలిచే వరి, పప్పు ధాన్యాలు, చిరు ధాన్యాలు, మొక్కజొన్న, సోయాబీన్, క్వినోవా, గోధుమ, బీన్స్, కంది, జొన్నలకు చెందిన 21 రకాల నూతన వంగడాలను రైతులకు అందుబాటులోకి తెస్తారు.
రాష్ట్రాల పరిస్థితులకు తగ్గట్టు విద్యుత్తు సంస్కరణలు
రూ.3,03,058 కోట్ల విలువైన విద్యుత్తు సంస్కరణలను కేంద్రం ప్రతిపాదించింది. ఇందులో కేంద్ర వాటా రూ.97,631 కోట్లు.
- సంస్కరణలు దేశవ్యాప్తంగా ఒకేలా కాకుండా రాష్ట్రాల పరిస్థితులకు తగ్గట్టు అమలుచేస్తారు. దీనికింద 25 కోట్ల స్మార్ట్ మీటర్లు, 10 వేల ఫీడర్లు, 4 లక్షల కిలోమీటర్ల ఎల్‌టీ ఓవర్‌హెడ్ లైన్ల నిర్మాణం చేపడతారు.
- సంస్కరణల ప్రాతిపదికన రాష్ట్రాలు అదనంగా రూ.1,05,864 కోట్ల రుణం పొందడానికి వీలవుతుంది.
ఆత్మనిర్భర్ భారత్ రోజ్‌గార్ యోజన పొడిగింపు
రూ.15వేల లోపు నెలవారీ వేతనం పొందుతున్న ఉద్యోగులకు ఈపీఎఫ్ కింద ఉద్యోగుల (12%),యాజమాన్యాల(12%) తరఫున మొత్తం 24% చెల్లించే కార్యక్రమాన్ని 2022 మార్చి 31 వరకు పొడిగించారు. వెయ్యిమంది లోపు ఉద్యోగులుంటే 24%, అంతకు మించి ఉంటే యాజమాన్య వాటా 12% కేంద్రం చెల్లిస్తుంది.
5 లక్షల మందికి ఉచిత వీసాలు
కొవిడ్ అనంతరం భారత్ పర్యటనకు వచ్చే తొలి 5 లక్షల మంది విదేశీ పర్యాటకులకు ఉచితంగా వీసాలు అందిస్తారు. ఈ ప్రయోజనాన్ని 2022 మార్చి 31 వరకు కానీ, 5 లక్షల మంది పర్యాటకులు పూర్తయ్యేంతవరకు కానీ కొనసాగిస్తారు. నమోదిత పర్యాటక గైడ్‌లకు రూ.లక్ష చొప్పున రుణాలు అందిస్తారు. ట్రావెల్ టూరిస్ట్ ఏజెన్సీలకు రూ.10 లక్షల వరకు ఇలాంటి రుణం సమకూరుస్తారు. ఈ రుణాలను దేనికోసమైనా ఉపయోగించుకోవచ్చు. వీటిపై ప్రాసెసింగ్ రుసుములు, ముందస్తు చెల్లింపు ఛార్జీలు ఉండవు.
ఎంఎస్‌ఎంఈలకు చేయూత
ఎంఎస్‌ఎంఈ సంస్థలకు ద్రవ్య లభ్యతను పెంచడానికి 'ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారంటీ స్కీం' కింద మరో రూ.1.50 లక్షల కోట్ల అదనపు గ్యారంటీ ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది.
- ఎగుమతులకు రూ.88 వేల కోట్లతో బీమా రక్షణ కల్పిస్తారు.
- ఇప్పటికే ప్రకటించిన ఎరువుల రాయితీ పెంపు పథకం కింద రూ.14,775 కోట్లు, ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన కింద రూ.93,869 కోట్లు ఖర్చు చేయనున్నారు.
- భారీస్థాయిలో ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు తయారుచేసే సంస్థలకు ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకాన్ని 2025-26 వరకు పొడిగించారు.
- పీపీపీ ప్రాజెక్టులు, ఆస్తుల విక్రయం విధానాలను సరళీకృతం చేస్తారు.
సూక్ష్మ రుణ సంస్థలకు హామీ
ఇది పూర్తిగా కొత్త పథకం. దీని కింద పాత, కొత్త బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు, సూక్ష్మ రుణ సంస్థలకు బ్యాంకులు ఇచ్చే రుణాలకు హామీ ఇస్తారు. ఈ సంస్థలు 25 లక్షల మంది వరకు రూ.1.25 లక్షల రుణాలందించవచ్చు. బ్యాంకులిచ్చే రుణాలపై అదనంగా 2% ఛార్జి చేస్తారు. కాలపరిమితి 3 ఏళ్లు.
ఆర్థిక రంగానికి బూస్టర్ డోస్
ఈ ఉద్దీపన ప్యాకేజీపై ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రశంసలు కురిపించారు. ఆర్థిక వ్యవస్థ పురోగతికి దోహదపడుతుందని పేర్కొన్నారు.
ఈ ప్యాకేజీ ఆర్థిక రంగానికి ఉత్తేజాన్నిచ్చి ఉత్పత్తిని, ఎగుమతులను మరింత ప్రోత్సహిస్తుంది. ఉద్యోగాల కల్పనకు; వైద్య వసతులు, ప్రైవేటు పెట్టుబడులను పెంచడానికి దోహదపడుతుంది. ఖర్చులు తగ్గించి, రైతుల ఆదాయాన్ని పెంచడానికి అనేక చర్యలు ఇందులో ఉన్నాయి.
- ప్రధాని నరేంద్ర మోదీ
ఆర్థిక రంగానికి తాజా ప్యాకేజీ.. బూస్టర్ డోస్ వంటిది. ఆర్థిక రంగాన్ని, ఉపాధి అవకాశాలను ఇది బలోపేతం చేస్తుంది.
- కేంద్ర హోంమంత్రి అమిత్‌షా