కీలక వడ్డీ రేట్లను తగ్గిస్తూ తీసుకున్న నిర్ణయాల ప్రభావం వల్ల మార్పు క్రమంగా వస్తోందని భారతీయ రిజర్వు బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ తెలిపారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలో జరిగిన ఆర్బీఐ బోర్డు సమావేశంలో పాల్గొన్న ఆయన.. రానున్న రోజుల్లో ఈ మార్పు ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుందని తెలిపారు. భవిష్యత్తులో రుణ వితరణ కూడా వృద్ధి చెందుతుందని వెల్లడించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి ద్రవ్య పరపతి విధాన సమీక్షలో కీలక వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచుతూ ఆర్బీఐ నిర్ణయం తీసుకున్న విషయం విధితమే.
అంచనాల్లోనే ద్రవ్యోల్బణం..
ఆర్థిక మందగమనం, పారిశ్రామిక రంగంలో సంక్షోభం, ద్రవ్యోల్బణంలో పెరుగుదలపై సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతున్న నేపథ్యంలో ఆర్బీఐ గవర్నర్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఆర్థిక వ్యవస్ధ మందగమనంలో ఉన్నా దాన్ని చక్కదిద్దేందుకు ఇటీవల తీసుకున్న నిర్ణయాలు మరింత విస్తృతంగా అమలు కావాల్సి ఉందని శక్తికాంత దాస్ అన్నారు. ద్రవ్యోల్బణం తాము అంచనా వేసినట్లే ఉంటుందని తెలిపారు.
ఇదీ చూడండి:శాంసంగ్ గెలాక్సీ ఎస్20 ధరలు, ప్రత్యేక ఆఫర్లు ఇవే