భారత్‌లో అత్యంత ప్రాచుర్యం పొందిన పెట్టుబడి సాధనం ఫిక్స్‌డ్ డిపాజిట్(Fixed Deposit). బ్యాంకుల్లో ఒక నిర్దేశిత కాలం సొమ్ము ఉంచడాన్ని సురక్షితంగా భావించడం సహా అదనంగా వడ్డీ వస్తుండడం వల్ల చాలా మంది దీనిపై మొగ్గు చూపుతుంటారు. మ్యూచువల్ ఫండ్స్, ఇన్సూరెన్స్, ఈక్విటీ- పెట్టుబడి పెట్టడానికి ఇలా చాలా మార్గాలు ఉన్నప్పటికీ.. కొంతమంది ఫిక్స్‌డ్ డిపాజిట్ వైపే మొగ్గుచూపుతుంటారు. ఈ నేపథ్యంలో ఎఫ్‌డీ చేసే ముందు పరిశీలించాల్సిన కొన్ని (fixed deposit plans) ముఖ్యమైన అంశాల్ని చూద్దాం..
కాలపరిమితి(FD time limit)..
స్వల్ప(1-3 ఏళ్లు), మధ్య(3-5 ఏళ్లు), దీర్ఘకాలం(5-10 ఏళ్లు).. కాలపరిమితికి అనుగుణంగా ఇలా ఎఫ్‌డీని మూడు వర్గాలుగా విభజిస్తుంటారు. కాలపరిమితిని బట్టి వడ్డీ రేటు మారుతుంటుంది. ఉదాహరణకు స్వల్పకాల ఎఫ్‌డీతో పోలిస్తే దీర్ఘకాల ఎఫ్‌డీలో వడ్డీరేటు (Fixed Deposit Interest Rate) ఎక్కువగా ఉంటుంది. మీ ఆర్థిక లక్ష్యాలు, అవసరాన్ని బట్టి కాలపరిమితిని ఎంచుకోవాలి.
రుణ సంస్థల క్రెడిట్ రేటింగ్..
ఎక్కువ వడ్డీరేటు ఇస్తున్నాయి కదా అన్ని బ్యాంకుల్లో ఎఫ్‌డీ చేయడం అంత శ్రేయస్కరం కాదు. వీలైనంత వరకు పేరుమోసిన సంస్థలనే ఎంచుకోవాలి. క్రిసిల్, కేర్ వంటి రేటింగ్ సంస్థలు బ్యాంకులు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలకు రేటింగ్ ఇస్తుంటాయి. క్రిసిల్ ఎఫ్‌ఏఏ+, కేర్ ఏఏ రేటింగ్ ఉన్న సంస్థల్ని ఎంపిక చేసుకోవడం ఉత్తమం. దీని వల్ల ఎలాంటి రిస్క్ ఉండదు.
వడ్డీరేటు..
కొవిడ్ నేపథ్యంలో బ్యాంకులు ఎఫ్‌డీ వడ్డీరేటును ఈ మధ్య తగ్గించాయి. ఇప్పుడు సగటున చాలా బ్యాంకుల్లో ఎఫ్‌డీ వడ్డీరేటు 6.75 శాతం వరకు ఉంది. సీనియర్ సిటిజన్లకు అదనంగా మరో 0.25 శాతం వడ్డీరేటు లభిస్తుంది. అలాగే వడ్డీరేట్లు రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి క్యుములేటివ్.. మరొకటి నాన్ క్యుములేటివ్. క్యుములేటివ్‌లో కాలపరిమితి ముగిసిన తర్వాత ఒకేసారి అప్పటి వరకు లభించిన వడ్డీతోపాటు అసలు మీ ఖాతాలో జమవుతాయి. అదే నాన్-క్యుములేటివ్‌లో.. మీరు ఎంచుకున్న దాన్ని బట్టి ప్రతినెలా లేదా మూడు నెలలు లేదా ఆరు నెలలు లేదా ఏడాదికి ఒకసారి వడ్డీ మీ ఖాతాలో జమవుతూ ఉంటుంది.
రుణ సదుపాయం (Loan on Fixed Deposit)..
సాధారణంగా మనం అర్హులమైతేనే బ్యాంకులు లోన్ మంజూరు చేస్తాయి. అయితే, ఒక నిర్దేశిత సొమ్ము ఎఫ్‌డీ చేసినవారు నేరుగా లోన్‌కు అర్హత సాధిస్తారు. ఈ ప్రయోజనాన్ని చాలా బ్యాంకులు అందిస్తున్నాయి. మీరు డిపాజిట్ చేసిన మొత్తంలో 75 శాతం సొమ్మును తిరిగి రుణం రూపంలో అందజేస్తుంటాయి. దీనికి వడ్డీరేటు మనకు ఎఫ్‌డీపై లభించే వడ్డీరేటు కంటే 2 శాతం అధికంగా ఉంటుంది. ఎఫ్‌డీ కాలపరిమితే.. లోన్‌కు కూడా వర్తిస్తుంది. ఉదాహరణకు మీరు 10 ఏళ్ల కాలపరిమితితో ఎఫ్‌డీ చేశారనుకుందాం. రెండో ఏడాది చివర్లో లోన్ తీసుకుంటే.. తిరిగి చెల్లించడానికి మీకు 8 ఏళ్ల గడువు ఉంటుంది.
మీ పెట్టుబడిపై మీకు మంచి రాబడి కావాలనుకుంటే.. వీటన్నింటినీ గమనించండి. ఆర్థిక విషయాల్లో సమయం సొమ్ముతో సమానం. ఆలస్యమైన కొద్దీ మీరు కొంత సంపదను కోల్పోయినట్టే. పైగా ద్రవ్యోల్బణం పెరుగుతున్న ఈ సమయంలో 6.75 శాతం కంటే తక్కువ రాబడి ఇచ్చే సాధనాల్లో మదుపు చేయడం వల్ల ఉపయోగం తక్కువే. మీ ఆర్థిక లక్ష్యాలు, కుటుంబ అవసరాలను బట్టి సురక్షితమైన పెట్టుబడి సాధనాన్ని మీరే ఎంచుకోండి!
ఇవీ చదవండి: