బుధవారంతో(మార్చి 31) 2020-21 ఆర్థిక సంవత్సరం పూర్తై.. గురువారం నుంచి (ఏప్రిల్ 1) 2021-22 ఆర్థిక సంవత్సరం ప్రారంభం కానుంది. కొత్త బడ్జెట్ ప్రతిపాదనలు అదే రోజు నుంచి అమల్లోకి రానున్న తరుణంలో.. ఆర్థికపరమైన అంశాల్లో భారీ మార్పులు చోటు చేసుకోనున్నాయి. ఆవి ఏటంటే..
ఆధార్ పాన్ లింక్ తప్పనిసరి..
ఆధార్‌తో పాన్ కార్డ్ లింక్ చేసేందుకు మార్చి 31ని చివరి తేదీగా నిర్ణయించింది ప్రభుత్వం. గడువు లోపు లింక్ చేసుకోకపోతే వారికి రూ.10 వేల వరకు జరిమానా విధించే అవకాశముంది.
పన్ను ఆదా పెట్టుబడులకు చివరి తేదీ..
2020-21కి సంబంధించి పన్ను ఆదా పెట్టుబడులకు కూడా మార్చి31తోనే తుది గడువు. పన్ను చెల్లింపుల్లో రాయితీలు దక్కాలంటే ఈ లోపే మదుపు చేయాలి.
కొత్త ఐటీ రూల్స్..
బడ్జెట్ ప్రసంగంలో 2021-22కి సంబంధించి కొత్త ఆదాయపు పన్ను చెల్లింపు నిబంధనలను ప్రతిపాదించారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. ఇవి ఏప్రిల్ 1 నుంచే అమల్లోకి రానున్నాయి.
ఆ బ్యాంకుల చెక్కులు చెల్లవు..
ముఖ్యంగా గత రెండేళ్లలో ఇతర బ్యాంకుల్లో విలీనమైన బ్యాంక్‌ల చెక్‌బుక్‌లు, పాస్‌బుక్‌లు నిరుపయోగంగా మారనున్నాయి. ఆయా బ్యాంకుల ఐఎఫ్ఎస్సీ, ఎంఐసీఆర్ కోడ్లూ మారనున్నాయి. వెంటనే చెక్‌బుక్‌లు, పాస్‌బుక్‌లు మార్చుకోవాలని బ్యాంకులు.. ఇప్పటికే వినియోగదారులకు సమాచారమిచ్చాయి.
ఆటో డెబిట్‌కు ఆర్బీఐ కొత్త రూల్స్..
ఆటో డెబిట్‌కు సంబంధించి కొత్త రూల్స్ తీసుకొచ్చింది ఆర్బీఐ. ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్న ఈ నిబంధనలతో ఇకపై రూ.5000 కంటే ఎక్కువ మొత్తంలో ఆటో డెబిట్ కావాలంటే.. ఓటీపీ వెరిఫికేషన్ తప్పనిసరి.
ధరలు పెరిగేవి.. తగ్గేవి..
2021-22 బడ్జెట్ ప్రతిపాదనల ప్రకారం.. ఏప్రిల్ 1 నుంచి పలు వస్తు, సేవల ధరల్లో మార్పులు చోటు చేసుకోనున్నాయి. టీవీలు, ఏసీలు వంటివి మరింత ప్రియం కానున్నాయి. వ్యవసాయ, దిగుమతి చేసుకున్న వైద్య ఉపకరణాల ధరలు కాస్త తగ్గనున్నాయి.