2019-20 ఆర్థిక సంవత్సరానికి (2020-21 మదింపు సంవత్సరం) సంబంధించి ఆదాయపు పన్ను రిటర్ను దాఖలు చేయని పన్ను చెల్లింపుదారులకు కీలక సూచన చేసింది ఐటీ విభాగం. ఆదివారంతో (జనవరి 10) ఇందుకు గడువు ముగియనున్న నేపథ్యంలో తక్షణమే ఆ పనిని పూర్తి చేసుకోవడం మేలని సూచించింది. ఎలాంటి ఆలస్య రుసుములు బారిన పడకుండా గడువు లోపు రిటర్ను ప్రక్రియ పూర్తి చేసుకోవాలని పేర్కొంది.
ఆడిటింగ్ అవసరమైన పన్ను చెల్లింపుదారులకు రిటర్ను దాఖలు చేసేందుకు ఈ నెల 31 వరకు అవకాశముంది.
నిజానికి ఐటీఆర్ దాఖలుకు తుది గడువు జులై 31తో ముగియాల్సి ఉండగా కరోనా నేపథ్యంలో దానిని తొలుత అక్టోబర్ 31 వరకు పెంచింది కేంద్రం. ఆ తర్వాత మరోసారి డిసెంబర్ 31 వరకు పెంచింది. గత నెల ఈ గడువును మరో పది రోజులు పొడగిస్తూ.. నిర్ణయం తీసుకుది. మళ్లీ గడువు పొడిగించే అవకాశాలు లేవని తెలుస్తోంది.
ఇప్పటి వరకు దాఖలకైన రిటర్నులు..
జనవరి 10 మధ్యాహ్నం 1 గంట వరకు మొత్తం 7,07,102 రిటర్నులు దాఖలైనట్లు ఐటీ విభాగం తెలిపింది. ఇందులో చివరి గంటలోనే 2,03,687 రిటర్నులు వచ్చినట్లు వివరించింది.
ఇదీ చూడండి:రిటర్ను దాఖలు ఆలస్యమైతే ఇబ్బందులివే..