తయారీ రంగంలో రికవరీ: ఫిక్కీ - తయారీ రంగ రికవరీపై ఫిక్కీ సర్వే
కరోనా సంక్షోభం నుంచి భారత తయారీ రంగం రికవరీ దిశగా అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. జూన్ త్రైమాసికంతో పోలిస్తే.. జులై-సెప్టెంబర్ మధ్య అధిక ఉత్పత్తిని నివేదించిన వారి నిష్పత్తి 10 శాతం నుంచి 24 శాతానికి పెరిగిందని పరిశ్రమల సమాఖ్య ఫిక్కీ తాజా సర్వేలో తేలింది.
భారత తయారీ రంగంలో నియామకాలపై అస్పష్టత ఉన్నప్పటికీ జులై-సెప్టెంబర్ త్రైమాసికంలో ఈ రంగం రికవరీ దిశగా అడుగులు వేసిందని పరిశ్రమ సమాఖ్య ఫిక్కీ తాజా త్రైమాసిక సర్వే వెల్లడించింది. జూన్ త్రైమాసికంతో పోలిస్తే, అధిక ఉత్పత్తిని నివేదించిన వారి నిష్పత్తి 10 శాతం నుంచి 24 శాతానికి పెరిగిందని సర్వే తేల్చింది. తక్కువ లేదా అదే మొత్తంలో ఉత్పత్తిని నివేదించిన వారి నిష్పత్తి 90 నుంచి 74 శాతానికి తగ్గిందని పేర్కొంది.
నియామకాల విషయానికొస్తే వచ్చే 3 నెలల పాటు అదనపు ఉద్యోగుల్ని తాము నియమించుకోవట్లేదని 80 శాతం తయారీ సంస్థలు పేర్కొనడం గమనార్హం. అయితే ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంతో పోలిస్తే (85 శాతం) రెండో త్రైమాసికంలో కొత్త నియామకాలకు సిద్ధంగా లేమని చెప్పిన తయారీ సంస్థలు స్వల్పంగా తగ్గడం రికవరీని సూచిస్తోందని ఫిక్కీ వివరించింది.
TAGGED:
FICCI JULY-SPETEMBER SURVEY