కీలక వడ్డీ రేట్లను భారతీయ రిజర్వు బ్యాంకు మరోసారి తగ్గించనుందా? అంటే విశ్లేషకుల నుంచి అవుననే సమాధానమే వినిపిస్తోంది. కరోనా కారణంగా కుదేలైన ఆర్థిక వ్యవస్థకు ఉతమివ్వడం సహా.. జూన్‌లో రిటైల్ ద్రవ్యోల్బణం పెరిగిన నేపథ్యంలో వచ్చే నెల జరగనున్న ఆర్బీఐ ద్రవ్య పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) సమావేశంలో రెపో రేటు తగ్గింపు దిశగానే నిర్ణయాలు ఉండొచ్చని అంటున్నారు విశ్లేషకులు.
ఆగస్టు 4 నుంచి ఆర్బీఐ ఎంపీసీ సమీక్ష ప్రారంభం కానుంది. కీలక వడ్డీ రేట్లపై 6వ తేదీన నిర్ణయం వెలువడనుంది.
కరోనా నేపథ్యంలో ఇప్పటికే రెండు సార్లు అత్యవసర సమీక్ష ద్వారా వడ్డీ రేట్లు తగ్గించింది ఆర్బీఐ. మొదట మార్చిలో, తర్వాత మేలో సమీక్షలు నిర్వహించి మొత్తం 115 బేసిస్ పాయింట్ల రెపో తగ్గించింది ఆర్బీఐ.
ప్రస్తుతం రెపో రేటు 4 శాతంగా, రివర్స్ రెపో రేటు 3.35 శాతంగా ఉన్నాయి.
మరోసారి తగ్గింపునకు కారణాలు..
ఇప్పటికే కీలక వడ్డీ రేట్లు తగ్గించిన.. ఆర్థిక వ్యవస్థ ఇంకా సంక్షోభం వల్ల ఒత్తిడి ఎదుర్కొంటోంది. దీనికి తోడు జూన్‌లో చిల్లర ద్రవ్యోల్బణం 6.09 శాతంగా నమోదైంది. కూరగాయల ధరలు భారీగా పెరగటం ఇందుకు ప్రధాన కారణం. చిల్లర ద్రవ్యోల్బణం 4 శాతానికి మించకుండా చూడాలని ప్రభుత్వం, ఆర్బీఐలు పరిమితులు పెట్టుకున్నాయి. సాధారణంగా రిటైల్ ద్రవ్యోల్బణం గణాంకాల అధారంగానే రెపో రేటును నిర్ణయిస్తుంటుంది ఆర్బీఐ.
ఈ కారణాలన్నింటి నేపథ్యంలో ఆగస్టులో జరగనున్న ఎంపీసీ సమావేశంలో 25 బేసిస్ పాయింట్ల వడ్డీ తగ్గింపు ఉండొచ్చని ప్రముఖ ఆర్థిక సేవల సంస్థ ఇక్రా ప్రధాన ఆర్థిక వేత్త అదిత్ నాయర్ అంచనా వేస్తున్నారు. రివర్స్ రెపో రేటు 35 బేసిస్ పాయింట్లు తగ్గించేందుకు అవకాశాలు ఉన్నాయని ఆయన అంటున్నారు.
యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎండీ రాజ్‌కిరణ్ రాయ్ కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. 25 బేసిస్ పాయింట్ల రెపో తగ్గింపు ఉండొచ్చని తెలిపారు. అయితే రేట్లు యథాతథంగా ఉంచేందుకూ అవకాశాలు లేకపోలేవని అభిప్రాయపడ్డారు.