దేశంలో డిజిటల్ కరెన్సీని ప్రవేశపెట్టే విషయమై, అందుకు సంబంధించిన విధివిధానాలను గురించి త్వరలో నిర్ణయాన్ని ప్రకటిస్తామని భారతీయ రిజర్వ్ బ్యాంకు (ఆర్‌బీఐ) వెల్లడించింది. దేశంలో డిజిటల్ రూపంలో కరెన్సీని అందుబాటులోకి తేవాల్సిన అవసరాన్ని, అవకాశాలను ఆర్‌బీఐ అంతర్గత కమిటీ నిశితంగా పరిశీలిస్తోందని డిప్యూటీ గవర్నర్ బి.పి. కనుంగో వెల్లడించారు. ఈ విషయమై తమ నుంచి త్వరలోనే ప్రకటన వెలువడనుందని ఆయన తెలిపారు.
బిట్‌కాయిన్ వంటి క్రిప్టో కరెన్సీ విధానాల వినియోగం అంతర్జాతీయంగా వేగంగా విస్తరిస్తోంది. భారత్‌లో కూడా అధికారిక డిజిటల్ కరెన్సీని ప్రవేశపెట్టే ఆలోచనలో ఉన్నట్టు ఆర్‌బీఐ గతంలో ప్రకటించింది. ఇటీవలి కాలంలో ప్రైవేటు డిజిటల్ కరెన్సీలు, వర్చువల్ కరెన్సీలు, క్రిప్టో కరెన్సీలకు దేశంలో ఆదరణ క్రమంగా పెరుగుతోంది. అయితే వీటివల్ల తలెత్తే ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని .. ప్రభుత్వం, ద్రవ్య నియంత్రణ సంస్థలు కాస్త ఆచితూచి అడుగులు వేస్తున్నాయి. ఇక ప్రైవేటు క్రిప్టోకరెన్సీ చలామణీని కేంద్ర ప్రభుత్వం గతవారం నిషేధించింది. ఈ నేపథ్యంలో ఆర్‌బీఐ ప్రకటన కీలకం కానుంది.
ఇదీ చదవండి : రెపో, రివర్స్ రెపో రేట్లు యథాతథం: ఆర్‌బీఐ