కరోనా వైరస్ (కొవిడ్-19) వల్ల తలెత్తిన సంక్షోభ పరిస్థితుల వల్ల ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యలోటు జీడీపీలో నిర్దేశిత లక్ష్యం 3.5 శాతం కంటే మించిపోవచ్చని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) గవర్నర్ శక్తికాంత దాస్ అన్నారు. ఏ మేరకు లోటు అదుపు తప్పిపోతుందనేది ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ వ్యయం, ఇతర నిర్ణయాల మీద ఆధారపడి ఉంటుందని 'కోజెన్సిస్' వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ఆర్ధిక వ్యవస్థను చక్కదిద్దేందుకు ప్రయత్నిస్తూనే, స్థిరత్వాన్ని కూడా ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవాల్సి ఉందన్నారు.
ఆ విషయంపై నిర్ణయం తీసుకోలేదు..
బడ్జెట్ లోటును 'నగదీకరణ' చేసే విషయంలో రిజర్వు బ్యాంకు ఇంకా ఒక అభిప్రాయానికి రాలేదని చెప్పారు. ఆర్‌బీఐ బ్యాలెన్స్ షీట్‌ను బలంగా ఉంచాల్సిన అవసరాన్ని, అన్నింటికీ మించి స్థూల ఆర్థిక స్థిరత్వాన్ని సాధించాలనే ప్రాథమిక లక్ష్యాలను పరిగణనలోకి తీసుకున్నాకే, ఈ విషయంలో ఒక నిర్ణయానికి వస్తామని శక్తికాంత దాస్ అన్నారు. ద్రవ్యలోటును భర్తీ చేయడానికి ప్రత్యామ్నాయాలపై దృష్టి సారిస్తామన్నారు. ప్రభుత్వ సెక్యూరిటీలను 'ప్రైవేట్ ప్లేస్‌మెంట్' పద్ధతిలో కేటాయిస్తారా? అనే ప్రశ్నకు, స్పష్టంగా సమాధానమివ్వలేనని, అన్ని రకాల అవకాశాలు పరిశీలిస్తామని పేర్కొన్నారు. 3 వారాల వ్యవధిలో రివర్స్ రెపో రేటును 115 బేసిస్ పాయింట్ల తగ్గించడాన్ని ప్రస్తావిస్తూ, కరోనా వైరస్ పరిస్థితులకు అనుగుణంగా తీసుకున్న తాత్కాలిక నిర్ణయంగా దీనిని అభివర్ణించారు. ఎంపీసీ (ద్రవ్య విధాన కమిటీ)కి చెప్పే అమలు చేశామన్నారు.
ఉద్దీపనే కాదు.. ఉపసంహరణా అవసరమే
ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టటానికి 'ఉద్దీపన పథకాలు' ప్రకటించే ముందు ఏఏ రంగాలకు ఏమేరకు మద్దతు కావాలనేది స్పష్టంగా నిర్దేశించుకోవాల్సి ఉందన్నారు. అనుకున్న విధంగా ఆర్థిక వ్యవస్థ గాడిలో పడినప్పుడు ఆ పథకాలను ఉపసంహరించడమూ ముఖ్యమని, అందుకు స్పష్టమైన ముందస్తు ప్రణాళిక ఉండాలని ఆర్‌బీఐ గవర్నర్ అన్నారు. ప్రభుత్వం ఉద్యోగులకు డీఏ (కరవు భత్యం) నిలుపుదల చేయటం ద్వారా ఖర్చును అదుపు చేసిందని, సమాజంలోని అట్టడుగు వర్గాలకు ఉపశమనం కలిగించే నిర్ణయాలు తీసుకుంటోందని వివరించారు. 'ఆహార ధాన్యాల సరఫరా, నగదు బదిలీ, జనధన్ ఖాతాల్లో నగదు జమ- వంటి చర్యల ద్వారా జీడీపీలో 0.8 శాతం మొత్తాన్ని వెచ్చించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. అందువల్ల ద్రవ్య లోటును 3.5 శాతానికి పరిమితం చేయటం ఎంతో కష్టం. 'లాక్‌డౌన్' వల్ల జీఎస్‌టీ, ప్రత్యక్ష పన్నుల వసూళ్లు బాగా తగ్గే అవకాశం ఉంద'న్నారాయన.
నష్టభయానికి బ్యాంకులు సిద్ధంగా లేవు
'టీఎల్‌టీఆర్‌ఓ 2.0' పై బ్యాంకులు పెద్దగా ఆసక్తి చూపకపోవటం ఆశ్చర్యం కలిగించిందా? అని ప్రశ్నించగా, అటువంటి అనుమానం తమకు ముందే ఉందన్నారు. బ్యాంకులు 'క్రెడిట్ రిస్క్' తీసుకోడానికి సిద్ధంగా లేవని, ఈ విషయాన్ని పూర్తిస్థాయిలో సమీక్షిస్తున్నామని తెలిపారు. చిన్న- మధ్యస్థాయి బ్యాంకింగేతర ఆర్థిక సంస్థ (ఎన్‌బీఎఫ్‌సీ)లు, సూక్ష్మ రుణ సంస్థలకు నిధుల లభ్యత పెంపొందించడమే పెద్ద సవాలని తెలిపారు. బ్యాంకుల ద్వారా ఎన్‌బీఎఫ్‌సీలకు నిధుల సదుపాయాన్ని కల్పించటమే టీఎల్‌టీఆర్‌ఓ 2.0 ఉద్దేశమని ఆయన వివరించారు. ఎన్‌బీఎఫ్‌సీలు తమ వినియోగదార్లకు 3 నెలల పాటు నెలవారీ కిస్తీలను వాయిదా వేసేందుకు ముందుకు వచ్చినా, ఎన్‌బీఎఫ్‌సీలకు మాత్రం బ్యాంకులు అటువంటి సౌకర్యం కల్పించడం లేదని దాస్ పేర్కొన్నారు.
రాష్ట్రాల ద్రవ్యలభ్యతకు చర్యలివిగో
కొవిడ్-19పై పోరాడే విషయంలో రాష్ట్రాలకు నగదు అవసరాలు అధికం కాబట్టి, ఆ విషయాన్ని జాగ్రత్తగా పర్యవేక్షిస్తున్నట్లు ఆర్‌బీఐ గవర్నర్ చెప్పారు. నగదు లభ్యత కోసం డబ్ల్యూఎంఏ (వేస్ అండ్ మీన్స్ అడ్వాన్సెస్) పరిమితి పెంచినట్లు తెలిపారు. అవసరం అయితే 'స్టాండింగ్ డిపాజిట్ సదుపాయాన్ని' తీసుకువస్తామని అన్నారు. దేశీయంగా బ్యాంకింగ్ వ్యవస్థ బలంగానే ఉందని, బ్యాంకుల మూలధన నిష్పత్తి (సీఏఆర్), నిరర్ధక ఆస్తులను (ఎన్‌పీఏ) పరిగణనలోకి తీసుకుని విశ్లేషించారు. బ్యాంకుల చేతిలో తగినంత మూలధనం ఉండాలనే ఉద్దేశంతో తాత్కాలిక చర్యగా డివిడెండ్లు ఇవ్వొద్దని చెప్పామన్నారు. ఆర్థిక సేవల రంగంలో సాంకేతిక పరిజ్ఞానం వినియోగాన్ని పెంపొందించటానికి కట్టుబడి ఉన్నట్లు, ఈ విభాగంలో మనదేశం, ఇతర దేశాలకు మార్గదర్శిగా ఉందని ఆయన వివరించారు. 'ఫిన్‌టెక్' రంగం క్రమబద్ధంగా విస్తరించాలని, ఫిన్‌టెక్ సంస్థల ద్వారా రుణ లభ్యత బాగా పెరగాలని ఆశిస్తున్నామని తెలిపారు.