ఒక వ్యక్తికి ఉన్న ఆదాయం, అతని వయసు.. ఇతర అంశాల ఆధారంగా ఆ వ్యక్తికి ఎంత వరకూ అప్పు తీసుకునేందుకు అర్హుడు అని బ్యాంకులు, రుణ సంస్థలు నిర్ణయిస్తాయి. రుణదాత నుంచి ఏ సమయంలోనైనా గరిష్ఠంగా ఎంత వరకూ రుణం తీసుకోవచ్చనేది ఇది తెలియజేస్తుంది. ఉదాహరణకు మీ క్రెడిట్ కార్డు స్టేట్‌మెంట్‌ను చూసినప్పుడు మీకు అందులో గరిష్ఠ పరిమితి ఎంత మేరకు ఉందనే విషయం తెలుస్తుంది. అందులో ఉన్న గరిష్ఠ పరిమితిని బట్టి, మీరు ఎంత వరకూ ఆ కార్డును వాడారు అన్నదాని ఆధారంగా మీ రుణ వినియోగ నిష్పత్తిని నిర్ణయిస్తారు. మీ క్రెడిట్ పరిమితి, ఆ క్రెడిట్ వినియోగాన్ని బట్టి, మీరు ఆర్థికంగా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు.. మిమ్మల్ని ఎంత మేరకు నమ్మొచ్చు అనేది నిర్ణయిస్తుంటారు.
40 శాతం దాటితే..
రుణ పరిమితి ఎంతున్నా.. అందులో నుంచి 30-40శాతం వరకూ వాడటమే మేలు. మీ క్రెడిట్ స్కోరు గణనలో 30శాతం వరకూ దీనిపైనే ఆధారపడి ఉంటుంది. ఇదొక్కటే కాదు.. ఇలా తక్కువ పరిమితిని వాడటం ద్వారా ఆర్థిక భారాన్నీ తగ్గించుకోవచ్చు. మానసికంగానూ ఒత్తిడి ఉండదు. మీ రుణ పరిమితిని సమర్థంగా వినియోగించుకుంటున్నట్లు బ్యాంకులు పరిగణిస్తాయి. క్రెడిట్ స్కోరు పెంచుకోవడానికీ ఇది ఉపయోగపడుతుంది. దీని ఫలితంగా కొత్త రుణాలు తీసుకునేందుకు మీరు మరింత అర్హత పొందుతారు. ఆర్థిక లక్ష్యాలను చేరుకునేందుకు అప్పులను ఆసరాగా ఉపయోగించుకునేందుకూ వీలవుతుంది.
వడ్డీ భారం పెరుగుతుంది..
బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ఒక వ్యక్తికి రుణం ఇచ్చేటప్పుడు అతనికున్న క్రెడిట్ స్కోరుతోపాటు, రుణ చెల్లింపుల చరిత్రనూ నిశితంగా గమనిస్తుంటాయి. ఈ మూడంకెల క్రెడిట్ స్కోరు బాగుంటే.. ఆ వ్యక్తికి రుణాలు, క్రెడిట్ కార్డులవంటివి రావడం పెద్ద కష్టమేమీ కాదు. ఈ స్కోరు 750కి మించి ఎంత ఎక్కువగా ఉంటే.. ఆ వ్యక్తి అప్పులు తీసుకునేందుకు అంత అర్హత సాధించినట్లు. అయితే, క్రెడిట్ స్కోరు తక్కువగా ఉన్నంత మాత్రాన ఆ వ్యక్తికి రుణాలు రావని చెప్పలేం. కొన్నిసార్లు బ్యాంకులు తక్కువ పరిమితితో క్రెడిట్ కార్డులు.. లేదా చిన్న మొత్తంలో రుణాలను ఇవ్వడానికి ముందుకు రావచ్చు. అయితే, దీనికి వడ్డీ భారం మాత్రం ఎక్కువగానే ఉంటుంది.
ఆదాయం తగ్గితే..
అధిక మొత్తంలో క్రెడిట్ పరిమితిని వాడేవారికి బ్యాంకులు కొత్త రుణాలను ఇచ్చేటప్పుడు ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తాయి. రుణగ్రహీత ఆదాయం ఎలా ఉంది.. క్రమం తప్పకుండా వస్తోందాలాంటివి పరిశీలించేందుకు బ్యాంకు ఖాతాలను తనిఖీ చేస్తుంటాయి. ఇతర బాధ్యతలు ఏమున్నాయన్నదీ పరిశీలిస్తుంటాయి. మీరు ఆర్థికంగా ఎంత సురక్షితంగా ఉన్నారన్నది వీటివల్ల తెలుస్తుంది. క్రెడిట్ కార్డు సంస్థ మీ ఆదాయ వ్యయాల్ని పరిశీలించి.. మీకు ఇంకా రుణం ఇవ్వడంలో ఎలాంటి ఇబ్బందీ లేదని భావిస్తే.. మీ కార్డు పరిమితిని పెంచే అవకాశం ఉంది. ఒకవేళ మీ ఆదాయం తగ్గినట్లు అనిపించినా.. కార్డు సంస్థలు మీ పరిమితిని తగ్గించే అవకాశాలు లేకపోలేదు.
అధికంగా తీసుకుంటే..
ముందే అనుకున్నట్లు రుణ అర్హతలో 30-40శాతం వరకూ వాడుకుంటే ఆర్థిక క్రమశిక్షణ ఉన్నట్లు లెక్క. ఒకవేళ అంతకు మించి వాడితే.. క్రెడిట్ స్కోరుపై ప్రభావం పడుతుంది. మీరు రుణాలు తీసుకునేందుకు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారని బ్యాంకులు భావిస్తుంటాయి. ఫలితంగా మీకు కొత్త రుణాల లభ్యతలో ఇబ్బందులు ఎదురు కావచ్చు.
కొన్నిసార్లు కొంతమంది మొత్తం కార్డు పరిమితిని వాడేస్తుంటారు. అంతకు మించి కూడా కొనుగోళ్లు చేస్తుంటారు. ఒకటి రెండుసార్లు బ్యాంకు ఈ విధంగా అధిక కొనుగోళ్లకు అనుమతించవచ్చు. కానీ, ప్రతిసారీ ఇలాగే జరుగుతుందని చెప్పలేం. అవసరమైనప్పుడు కొనుగోలు చేసేందుకు డబ్బు లేకపోవడం, కార్డులోనూ క్రెడిట్ పరిమితి లేకపోతే ఇబ్బందే కదా..
కొన్ని క్రెడిట్ కార్డులు ఎక్కువ మొత్తం వాడుకునేందుకు అనుమతినిస్తాయి. కానీ, దీనికి అధిక మొత్తంలో ఛార్జీలను వసూలు చేస్తుంటాయి.
కొత్త రుణం కావాలంటే..
"మీరు త్వరలోనే కొత్తగా ఏదైనా పెద్ద అప్పు తీసుకోవాలని అనుకుంటున్నారనుకోండి.. ఇప్పుడు మీ క్రెడిట్ స్కోరుపై ఎలాంటి ప్రతికూలతలూ లేకుండా చూసుకోవాలి. వీలైనంత వరకూ తక్కువ కార్డులో తక్కువ మొత్తం వాడుకుంటూ ఉండాలి. ఇప్పటికే తీసుకున్న రుణ వాయిదాలను క్రమం తప్పకుండా చెల్లించడం తప్పనిసరి. అనుకోకుండా క్రెడిట్ కార్డు పరిమితిని మొత్తం వాడితే.. వెంటనే ఆ బిల్లును అణాపైసలతో సహా చెల్లించేయండి. కొత్తగా అప్పు తీసుకోబోయే ఆరు నెలల ముందు నుంచీ ఈ కనీస జాగ్రత్తలు తప్పనిసరి. దీంతోపాటు ఎప్పటికప్పుడూ మీ క్రెడిట్ స్కోరును, రుణ చరిత్ర నివేదికనూ చూసుకోవడం మర్చిపోకండి."
- విల్‌ఫ్రెడ్ సిగ్లెర్, డైరెక్టర్, సీఆర్‌ఐఎఫ్ ఇండియా
ఇదీ చూడండి:కీలక వడ్డీ రేట్లు మళ్లీ యథాతథమే!