ఆరు నెలల క్రితం కేంద్రం తీసుకొచ్చిన సాగు సంస్కరణల ఫలితాలు.. అన్నదాతలకు అందుతున్నాయని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. 'అసోచామ్ ఫౌండేషన్ వీక్ 2020' సదస్సులో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్న మోదీ.. తయారీ రంగం నుంచి కార్మిక రంగం వరకు తమ సర్కారు తీసుకొచ్చిన సంస్కరణల ఫలితంగా దేశంలోకి భారీ ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయని చెప్పారు. ఒకప్పుడు భారత్‌లో ఎందుకు పెట్టుబడులు పెట్టాలని ఆలోచించే సంస్థలు ఇప్పుడు ఎందుకు పెట్టుబడి పెట్టకూడదని ఆలోచించేలా పరిస్థితి మారిందన్నారు.
ఆత్మనిర్భర్ భారత్ ద్వారా.. భారత్ తన అవసరాలు తీర్చుకోవడమే కాకుండా ప్రపంచదేశాలకూ సహకరిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు ప్రధాని.
త్వరలో.. ప్రపంచంలో మరో పారిశ్రామిక విప్లవం వస్తుందని అందులో భారత్ ప్రముఖ పాత్ర పోషిస్తుందని మోదీ పేర్కొన్నారు. దేశంలో పరిశోధన- అభివృద్ధి(ఆర్&డీ) విభాగంలో ప్రైవేటు సంస్థల పెట్టుబడులు.. భారీగా పెరగాల్సిన అవసరం ఉందన్నారు. దేశాన్ని స్వావలంబనగా మార్చేందుకు కావాల్సిన అన్ని ప్రయత్నాలు చేయాలని పరిశ్రమలకు పిలుపునిచ్చారు.
భారత్‌పై భరోసా పెరిగింది..
భారత ఆర్థిక వ్యవస్థను ప్రపంచం మొత్తం విశ్వసిస్తోందని.. కరోనా వంటి సంక్షోభ పరిస్థితుల్లోనూ ఎఫ్‌డీఐలు, ఎఫ్పీఐలలో భారీ వృద్ధి ఇందుకు నిదర్శనమని వివరించారు మోదీ. భారత్ పట్ల ప్రపంచానికి ఉన్న భరోసా కొత్త ఎత్తులకు చేరిందని పేర్కొన్నారు. ఇదే సమయంలో దేశీయంగానూ మన పెట్టుబడులను.. భారీగా పెంచాల్సిన ఆవశ్యకత ఉందన్నారు.
ఇదే కార్యక్రమంలో పాల్గొన్న టాటా గ్రూప్ గౌరవ ఛైర్మన్ రతన్ టాటాతో మోదీ సంభాషించారు. భారత దేశ అభివృద్ధిలో టాటా గ్రూప్ కీలక పాత్ర పోషించినట్లు కొనియాడారు.
ఇదీ చూడండి:'చెరుకు మద్దతు ధరను తగ్గించలేం'