ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి అర్ధభాగంలో బ్యాంకులు, గుర్తింపు పొందిన ఆర్థిక సంస్థల్లో రూ.1,13,374 కోట్ల మోసాలు నమోదైనట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఈ మేరకు లోక్‌సభలో లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు మంత్రి.
ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో మోసాలను నిర్ణీత సమయంలో గుర్తించడం, దర్యాప్తు కోసం 2015లో కార్యాచరణ రూపొందించినట్లు వెల్లడించారు. ఈ కార్యాచరణ ద్వారా నిర్మాణాత్మక, క్రమమైన సంస్కరణలను అమలు చేసినట్లు తెలిపారు. తాము అమలు చేస్తున్న విధానాల వల్ల ఎక్కువ మోసాలు బయటపడ్డాయని వెల్లడించారు.
గత ఆర్థిక సంవత్సరం(2018-19)లో రూ.71,543 కోట్ల మోసాలు బయటపడగా.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి ఆర్ధభాగంలోనే అంతకు మించిన మోసాలు బయటపడినట్లు సీతారామన్ తెలిపారు.
ఎన్పీఏలూ తగ్గాయ్..
ప్రభుత్వ రంగ బ్యాంకుల నిరర్ధక ఆస్తులు(ఎన్పీఏలు) 2019 సెప్టెంబర్ 30 నాటికి రూ.7.27 లక్షల కోట్లకు తగ్గినట్లు కేంద్రం వెల్లడించింది. లోక్‌సభలో ప్రశ్నోత్తరాల సమయంలో ఎన్పీఏలపై కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్ వివరణ ఇచ్చారు.
2018 మార్చి వరకు ఇలా..
రిజర్వు బ్యాంక్ డేటా ప్రకారం నిరర్ధక ఆస్తులు, స్థూల ఎన్పీఏలు 2015 మార్చి 31 నాటికి రూ.2,79,016 కోట్లుగా ఉండగా.. 2017 మార్చి 31 నాటికి రూ.6,84,732 కోట్లు.. 2018 మార్చి 31 నాటికి రూ.8,97,601 కోట్లకు పెరిగినట్లు ఠాకూర్ తెలిపారు.
తమ ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణలతో ఎన్పీఏలు 2019 సెప్టెంబర్ 30 నాటికి రూ.7,27,266 కోట్లకు తగ్గినట్లు వెల్లడించారు.