ప్రపంచవ్యాప్తంగా చాలా మంది జీవితాలు కరోనా మహమ్మారి వల్ల దెబ్బతిన్నాయి. 2020 ఆరంభం నుంచే ఈ వైరస్ ప్రభావం ప్రారంభమై ఇంకా కొనసాగుతోంది. ఈ వైరస్ నుంచి ప్రాణాలు కాపాడుకోవటం, ఆరోగ్యంగా ఉండటం వంటి విషయాలకే చాలా మంది సమయం కేటాయించారు. ఈ కారణంగా చాలా మంది ఆర్థిక పరిస్థితి తీవ్రంగా దెబ్బతింది. ఇంకో నాలుగు రోజుల్లో కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నాం. ఈ ఏడాది కరోనా వల్ల ఆర్థిక స్థితి దెబ్బతిన్నా.. 2021 లో దానిని గాడిలో పెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సరైన పెట్టుబడులు పెట్టటం ద్వారా ఆర్థిక, ఆరోగ్య భద్రతతో పాటు మానసిక ఆరోగ్యంపై దృష్టి సారించాలని నిపుణులు సూచిస్తున్నారు. పొదుపు చేయటం పెట్టుబడి పెట్టటం వల్ల ఆర్థిక భద్రత సాధించుకోవచ్చు. ఆరోగ్య, మానసిక ఆరోగ్య భద్రత కోసం సరైన బీమా తీసుకోవాలి.
కొన్ని సూత్రాలు పాటించడం ద్వారా 2021లో ఆర్థిక భద్రత సాధించవచ్చని నిపుణులు చెబుతున్నారు. వాటి గురించి తెలుసుకుందాం.
అత్యవసర నిధి
ఆరోగ్య పరంగా లేదా ఉపాధి పరంగా అత్యవసరంగా వచ్చే ఖర్చుల కోసం ఈ నిధి ఉపయోగపడుతుంది. దీనిని ఏర్పాటు చేసుకోవటం ద్వారా అత్యవసర పరిస్థితుల్లో నిర్భయంగా ఎదుర్కోవచ్చు. ప్రారంభంలో 3 నెలల ఖర్చులకు సరిపడా నిధితో మొదలు పెట్టి క్రమక్రమంగా దానికి 12 నెలల ఖర్చు వరకు పెంచుకోవాలని నిపుణులు చెబుతున్నారు.
బీమాతోనే ధీమా
బీమా లేనట్లయితే ఆర్థికంగా చిక్కిపోయే పరిస్థితి తలెత్తవచ్చు. 2020లో చాలా మంది విషయంలో ఇది నిజమైంది. కరోనా వల్ల ఆస్పత్రుల్లో ఉండాల్సి రావటం వల్ల ఇది జరిగింది. సంపాదించే వ్యక్తి అనారోగ్యం పాలవటం వల్ల కుటుంబాలు ఇబ్బందులను ఎదుర్కొన్నాయి. ఈ పరిస్థితి రాకుండా చూసుకునేందుకు 2021లో తీర్మానం చేసుకోవాలి. దీనికోసం ఆరోగ్య బీమాతో పాటు జీవిత బీమా తీసుకోవాలి. దీనివల్ల అనారోగ్యానికి గురైనా లేక అనుకోని పరిస్థితుల్లో మనం వారిని విడిచి వెళ్లినా కుటుంబం నిశ్చింతగా ఉండొచ్చు.
రుణం విముక్తి
ఎక్కువ వడ్డీ రేటు ఉన్న రుణం నుంచి విముక్తులు కావటం చాలా ముఖ్యం. క్రెడిట్ కార్డులను సరైన రీతిలో వాడుకోవాలి. అదే విధంగా నెల నెలా వాటి బిల్లులను చెల్లించుకోవాలి. రుణాలు లేనట్లయితే నెల వారీ ఆదాయాన్ని రుణాల చెల్లింపునకు బదులు పొదుపునకు ఉపయోగించుకోవచ్చు లేదా రోజు వారీ ఖర్చులకు వాడుకోవచ్చు. పెద్ద రుణాలు ఉన్నట్లయితే... ఉద్యోగం కోత సమయంలో ఉపయోగపడే విధంగా కొంత నిధిని సమకూర్చుకోవాలని నిపుణులు చెబుతున్నారు.
ప్రణాళిక ప్రకారం పెట్టుబడి
పన్ను ప్రయోజనాల కోసమో లేక స్నేహితుడు చెప్పాడనో పెట్టుబడులు పెట్టకూడదు. ప్రణాళికను అనుసరిస్తూ... స్వల్ప, మధ్యస్థ, దీర్ఘ కాల లక్ష్యాలకు అనుగుణంగా వేరువేరుగా పెట్టుబడులు పెట్టుకోవాలి. అంతేకాకుండా తీసుకునే రిస్కును కూడా అంచనా వేసుకోవాలి. అన్ని ఆర్థిక పరిస్థితులలో ఉపయోగపడే విధంగా పెట్టుబడులు పెట్టుకోవాలి.