బ్యాంకింగ్ వ్యవస్థలో పెరుగుతున్న మొడి బకాయిల పరిష్కారానికి 'బ్యాడ్ బ్యాంక్' ఏర్పాటు చేయనున్నట్లు కేంద్రం బడ్జెట్ 2021-22లో ప్రకటించింది. ఈ బ్యాంక్ జూన్ నుంచి కార్యకలాపాలు ప్రారంభించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ బ్యాంక్‌ను నేషనల్ అసెట్ రీ కన్స్ట్రక్షన్ కంపెనీ లిమిటెడ్ (ఎన్ఏఆర్సీఎల్) పేరుతో వ్యవహరించనున్నట్లు సమాచారం.
ఏమిటీ బ్యాడ్ బ్యాంక్?
సాధారణంగా వాణిజ్య బ్యాంకులు రుణాలపై వచ్చే వడ్డీ ఆధారంగా మనుగడ సాగిస్తుంటాయి. బ్యాంకులు ఇచ్చే రుణాల ఫలితంగా కొత్త పరిశ్రమలు పుట్టుకొచ్చి ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి. తద్వారా ఆర్థిక వ్యవస్థ బలోపేతమవుతుంది. ఒకవేళ అవే రుణాలు నిరర్ధక ఆస్తులు(ఎన్‌పీఏ)గా అంటే మొండి బకాయిలుగా మారితే బ్యాంకింగ్ వ్యవస్థ మనుగడకే ప్రమాదం ఏర్పడుతుంది. ఈ నేపథ్యంలో బ్యాడ్ బ్యాంక్ పేరిట కొత్త వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారు. వివిధ వాణిజ్య బ్యాంకుల్లో ఎటూ తేలకుండా ఉండిపోయిన ఎన్‌పీఏలను దీనికి బదిలీ చేస్తారు. దీనితో బ్యాంకులకు ఎన్‌పీఏల తలనొప్పి తగ్గుతుంది. ఆయా ఖాతాల నుంచి రుణాలను రికవరీ చేయడం, రుణాలు తీసుకున్న సంస్థలతో చర్చలు జరపడం, లేదా ఈ మొండి బకాయిలను ఎలా తిరిగి రాబట్టాలో వంటి అంశాలపై బ్యాడ్ బ్యాంక్ దృష్టి సారిస్తుంది.
పబ్లిక్, ప్రైవేట్ భాగస్వామ్యం..
ఈ కొత్త బ్యాంక్‌లో ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకుల భాగస్వామ్యం ఉండనున్నట్లు భారతీయ బ్యాంకుల సంఘం (ఐబీఏ) సీఈఓ సునీల్ మెహతా పేర్కొన్నారు. ప్రస్తుత ఈ బ్యాంక్‌కు సంబంధించిన ప్రక్రియ వేగంగా జరుగుతోందని వెల్లడించారు.
ఎన్‌పీఏల సమస్య పరిష్కారానికి గత ఏడాదే బ్యాడ్ బ్యాంక్‌కు ప్రతిపాదనలు కేంద్రం ముందు ఉంచింది ఐబీఏ. ఆ ప్రతిపాదనల ప్రకారమే.. అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ (ఏఆర్సీ), అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ (ఏఎంసీ) మోడల్లో బ్యాడ్ బ్యాంక్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది కేంద్రం.
ఇవీ చదవండి: