దేశ ఆర్థిక వ్యవస్థకు ఎమ్ఎస్ఎమ్ఈలు(మధ్య, చిన్న, సూక్ష్మ తరహా పరిశ్రమలు) చాలా కీలకం. దేశ జీడీపీలో వీటి వాటా దాదాపు 30 శాతం. కరోనా కంటే ముందే సమస్యల్లో ఉన్న ఈ పరిశ్రమలు.. మహమ్మారి వల్ల విపరీతంగా దెబ్బతిన్నాయి. వీటిని ఆదుకునేందుకు ప్రభుత్వం 'ఆత్మనిర్భర్ భారత్'లో భాగంగా చర్యలు తీసుకుంది. అయినా ఇంకా పూర్తి స్థాయిలో ఇవి కోలుకోలేదు. ఈ నేపథ్యంలో రాబోయే బడ్జెట్ ద్వారా ప్రభుత్వం మరింత సహాయం అందించాలని ఆ పరిశ్రమల ప్రతినిధులు కోరుకుంటున్నారు.
భారత్‌లో ఎమ్ఎస్ఎమ్ఈలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య వ్యవస్థీకృత రుణాలు అందకపోవటం. ఈ తరహా వాటిలో 90 శాతం పరిశ్రమలకు వ్యవస్థీకృత రుణాలు అందటం లేదని పరిశ్రమల ప్రతినిధులు చెబుతున్నారు. చిన్న చిన్న దేశాల్లో పరిస్థితి మెరుగ్గా ఉందని.. అలాంటి పరిస్థితి ఇక్కడ ఉండాలని వారు కోరుతున్నారు. అవ్యవస్థీకృత రుణాల వల్ల వడ్డీ భారం ఎక్కువగా ఉండటం వల్ల లాభాలు పొందే సామర్థ్యం తగ్గిపోతోంది. సులభంగా రుణాలు పొందే పద్దతి తీసుకురావాలని పరిశ్రమల వర్గాలు కోరుతున్నాయి.
"బయట నుంచి వడ్డీకి తీసుకోవటం వల్ల కాస్ట్ ఆఫ్ ఫండ్స్ పెరిగిపోతోంది. వడ్డీ కూడా ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల లాభాలు పొందే శక్తి తగ్గిపోతోంది. ఇండోనేసియా, థాయిలాండ్, వియత్నాం లాంటి దేశాల్లో 30 నుంచి 40 శాతం ఎమ్ఎస్ఎమ్ఈలు వ్యవస్థీకృత రుణాలు పొందుతున్నాయి. భారతదేశంలో కేవలం 10 శాతం ఈ తరహా రుణాలు పొందుతున్నాయి. ఎన్బీఎఫ్సీలతో పాటు బ్యాంకుల్లో సులభంగా రుణం పొందే పరిస్థితి కల్పించాలి"
- శ్రీనివాస్ గరిమెళ్ల, ఛైర్మన్, మ్యానుఫ్యాక్చరింగ్ కమిటీ, ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ
కరోనా కంటే ముందు నుంచే ఎమ్ఎస్ఎమ్ఈలు సమస్యలు ఎదుర్కుంటున్నాయి. ఆత్మనిర్భర్ భారత్‌లో భాగంగా ఏక కాల పునర్ వ్యవస్థీకరణ, మారటోరియం, తనాఖా లేని రుణాలు లాంటి వాటికి అవకాశం కల్పించింది ప్రభుత్వం. వన్ టైమ్ రీస్ట్రక్చర్ స్కీమ్‌కు మార్చి 31తో గడువు తీరనుంది. మారటోరియం డిసెంబర్లోనే ముగిసింది. వన్ టైమ్ రీస్ట్రక్చర్‌కు కనీసం ఆరు నెలల వరకు గడువు పెంచాలని, కనీసం ఖాయిలా పడే స్థాయిలో ఉన్న పరిశ్రమలకైనా మరోసారి మూడు నెలల పాటు మారటోరియం సదుపాయాన్ని ఇవ్వాలని కోరుతున్నారు.
ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్
ప్రభుత్వం దేశీయంగా తయారీ రంగాన్ని ప్రోత్సహించేందుకు ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్‌ను ప్రకటించింది. అంటే గత సంవత్సరం కంటే ఎక్కువ ఉత్పత్తి చేస్తే... అందుకు అనుగుణంగా ప్రోత్సాహకాలను ప్రభుత్వం అందిస్తుంది. అయితే ఎలక్ట్రానిక్స్, మొబైల్ ఫోన్స్ మొదలైన వాటికే ఈ పథకం వర్తిస్తోంది. అన్ని ఎమ్ఎస్ఎమ్ఈలకు ఈ పథకాన్ని ఇవ్వాలని, ఎగుమతి ఆధారిత రంగాలకు కూడా ఇవ్వాలని పరిశ్రమ వర్గాలు కోరుతున్నాయి.
"ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ కేవలం కొన్ని రంగాలకే ఇచ్చారు. ఎమ్ఎస్ఎమ్ఈలు ఉన్న అన్ని రంగాలకు వీటిని వర్తించాలి. భారతదేశం ఎగుమతుల్లో ఎమ్ఎస్ఎమ్ఈల వాటా 40 శాతంగా ఉంది. తెలంగాణ ఎగుమతుల్లో వీటి వాటా 58 శాతంగా ఉంది. పీఎల్ఐ స్కీమ్ ఎగుమతి ఆధారిత రంగాలకు కూడా వర్తించాలి. దీనివల్ల ఎగుమతుల్లో ఉన్న కంపెనీలు ఇంకా ఉత్పత్తిని పెంచే అవకాశం ఉంటుంది."
- శ్రీనివాస్ గరిమెళ్ల
ఇన్నోవేషన్...
సాధారణంగా ఎమ్ఎస్ఎమ్ఈలు తక్కువ నిధులతో కార్యకలాపాలు నిర్వహిస్తుంటాయి. నవకల్పనలకు కావాల్సిన మానవ వనరులు, ఆర్థిక వనరులు వీటి వద్ద ఉండవు. దీనివల్ల పరిశోధన, అభివృద్ధిని ఇవి ప్రోత్సహించేందుకు మొగ్గుచూపవు. అయితే ఈ విషయంలో ప్రభుత్వం ప్రోత్సాహకాల అందించినట్లైతే పురోగతి సాధించవచ్చని పరిశ్రమల వర్గాలు అంటున్నాయి.
"ఆర్ అండ్ డీకి ఎమ్ఎస్ఈలు సమయం వెచ్చించవు. మానవ వనరులు కూడా ఉండవు. చాలా కంపెనీలకు ఇన్నోవేషన్ చేసేందుకు వనరులు లేవు. ఎమ్ఎస్ఎమ్ఈలలో ఇన్నోవేషన్ కోసం ప్రోత్సహకాలు ఇవ్వాలి. దీనివల్ల రిస్క్ తీసుకునే సామర్థ్యం పెరుగుతుంది. పరిశోధన, అభివృద్ధి ఖర్చు పెడతాయి. కొత్త ఉత్పత్తి వస్తే ఫైనాన్స్ ఇవ్వాలి.
- శ్రీనివాస్ గరిమెళ్ల
ఎమ్ఎస్ఎమ్ఈలకు తక్కువ వడ్డీ రేట్లతో రుణాలివ్వాలి. బ్యాంకు 8 శాతం ఇస్తే 7.5 లేదా 7లో ఇవ్వాలి. ఎన్బీఎఫీసీలు 10 శాతానికి ఇస్తే 8 శాతానికి ఇవ్వాలి. ప్రభుత్వం గ్యారంటీ ఇవ్వాలి. దీనివల్ల బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు ఇస్తాయి.
డిజిటల్ ట్రాన్సఫర్మేషన్
ప్రస్తుతం సైజుతో నిమిత్తం లేకుండా ప్రతి కంపెనీ డిజిటలీకరణ వైపు అడుగులు వేయటం అనివార్యం అయింది. డిజిటలైజేషన్ లేని కంపెనీలు మూతపడే పరిస్థితి ఉంది. ప్రభుత్వం కూడా డిజిటలైజేషన్ గురించి మాట్లాడుతోంది. ఈ విషయంలో ప్రభుత్వం ప్రోత్సాహకాలు ఇవ్వాలని... అలా చేయటం వల్ల త్వరగా డిజిటలీకరణ అవుతుందని ఎమ్ఎస్ఎమ్ఈ ప్రతినిధులు అంటున్నారు. కార్పస్ ఫండ్ పెట్టి... ఐటీ, డిజిటల్ వైపు మళ్లిన ఎమ్ఎస్ఎమ్లకు ప్రోత్సాహకాలు ఇవ్వాలని వారు కోరుతున్నారు.
"డిజిటలైజేషన్ అనేది పరిశ్రమలో నిబంధనగా మారింది. డిజిటల్ వైపు మళ్లటం అనేది ప్రభుత్వానికి చాలా పెద్ద అంశం. ఎమ్ఎస్ఎమ్ఈలు ఐటీ ఇన్ ఫ్రా, సాఫ్ట్ వేర్ తదితరాల్లో పెట్టుబడులు పెడితే ప్రోత్సాహకాలు ఇవ్వాలి. ఇలా చేయటం వల్ల డిజిటల్ వైపు మళ్లటం వేగవంతం అవుతుంది. ఇప్పుడు పరిశ్రమలు ప్రత్యామ్నాయం లేకపోవటం వల్ల డిజిటల్ వైపు మళ్లుతున్నాయి. కార్పస్ ఫండ్ పెట్టి ప్రోత్సాహకాలు ఇవ్వటం వల్ల డిజిటల్ బదిలీ వేగంగా జరుగుతుంది. డిజిటల్ ఉపయోగం వల్ల పారదర్శకత వచ్చి ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుంది."
- శ్రీనివాస్ గరిమెళ్ల