ప్రతి కుటుంబంలో మహిళా పాత్ర చాలా కీలకం. పిల్లల, పెద్దల బాగోగులు చూసేది వీరే... కుటుంబాన్ని ఆరోగ్యంగా ఉంచేది వీరే. కానీ వ్యక్తిగత, ఉద్యోగ జీవితంలో పడి చాలా మంది మహిళలు ఆరోగ్య బీమాను తీసుకోరు. మన దేశ మహిళల్లో ఎక్కువ మంది కుటుంబ బాధ్యతలపై ఏకాగ్రతతో వ్యక్తిగత జీవితాన్ని పట్టించుకోవడం లేదు.
ఇటీవల విడుదలైన ఒక నివేదిక ప్రకారం... భారత్‌లో ఉద్యోగం చేస్తోన్న వివాహిత మహిళల్లో వ్యక్తిగత ఆర్థిక నిర్ణయాలు తీసుకునేది 13 శాతం. అవివాహిత మహిళా ఉద్యోగుల్లో ఇది 18 శాతం. భారతీయ మహిళల్లో 30 శాతం మందికే ఆరోగ్య బీమా ఉంది. పురుషుల్లో రెట్టింపు శాతానికి బీమా ఉంది.
భారత్‌లో ఆరోగ్య బీమాపై కొంతకాలంగా అవగాహన పెరుగుతోంది. ధరల పెరుగుదల, వైద్య ఖర్చుల పెరుగుదల దృష్ట్యా సరైన ఆరోగ్య బీమాను తీసుకోవటం మరింత ముఖ్యం. కుటుంబానికి భరోసానిచ్చే మహిళకు వ్యక్తిగత ఆరోగ్య బీమా ఎంతో ముఖ్యం.
ఇదీ చూడండి :సొంతింటి కలగనేవారికి శుభవార్త
కుటుంబం మొత్తంపై ప్రభావం...
భారతదేశంలో పురుషుల కంటే మహిళలే ఎక్కువ సార్లు వైద్యం చేయించుకుంటారు. మహిళలకు ఆయుర్దాయం ఎక్కువైనప్పటికీ... వాళ్లు దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడటానికి అవకాశాలు ఎక్కువ. కాబట్టి వారికి ఆరోగ్య బీమా కావాలి.
పలు నివేదికల ప్రకారం 38 శాతం భారతీయ మహిళలు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నారు. కానీ 35 శాతం ఆడవారికే ఆరోగ్య బీమా ఉంది. కుటుంబంతో పాటు సమాజానికి మహిళలు ఎంతో ముఖ్యం. అకస్మాత్తుగా వచ్చే వైద్య ఖర్చులపై అవగాహన ఉంచుకోవటం చాలా ముఖ్యం. దీనితో కుటుంబం ఆర్థికంగానే కాకుండా ఆరోగ్యపరంగా కూడా మంచి స్థాయిలో ఉంటుంది.
ఇంట్లో మహిళ ఆరోగ్యం బాగోలేకపోతే.... దాని ప్రభావం కేవలం ఆమె వరకే పరిమితం కాకుండా కుటుంబ సభ్యులందరిపై పడుతుంది. పెరుగుతున్న వైద్య ఖర్చుల దృష్ట్యా ఆరోగ్య బీమా లేకుంటే అప్పుల పాలు కావాల్సిన పరిస్థితి. అన్ని వయస్కుల ఆడవారికి ఆరోగ్య బీమా అవసరం. యుక్త వయస్కులు తల్లిదండ్రులతో కలిసి ఆరోగ్య బీమా పాలసీ తీసుకోవచ్చు.
మహిళా కేంద్రీకృత పాలసీలు ఎన్నో...
ప్రస్తుతం ఉన్న మార్కెట్‌లో బీమా సంస్థలు వివిధ రకాల ఆరోగ్య బీమాలను తీసుకొచ్చాయి. మహిళలకు వచ్చే వ్యాధులను దృష్టిలో ఉంచుకొని వారికోసమే ప్రత్యేకంగా తయారు చేసినవి ఉన్నాయి. మహిళకు వచ్చే దీర్ఘకాలిక వ్యాధుల కోసమూ పాలసీలు ఉన్నాయి. క్యాన్సర్ చికిత్సకు యాడాన్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.
ఇంతకుముందు కార్పొరేట్ ప్లాన్‌ల ద్వారా మాత్రమే ప్రసూతి బీమా అందేది. కానీ ఇప్పుడు చాలా కంపెనీలు వీటిని అందుబాటులోకి తీసుకొచ్చాయి. ప్రసూతి బీమాను యాడాన్ రూపంలో కూడా కొన్ని కంపెనీలు అందిస్తున్నాయి.
ఇదీ చూడండి :ధీమాగా బీమా పొందాలంటే?
ప్రసూతి బీమా...
మంచి ఆస్పత్రిలో చికిత్సలు, వివిధ రకాల పరీక్షలు, మందులు, ఆస్పత్రి తదితరాలతో కలిపి ప్రసవానికి సరాసరిగా లక్ష రూపాయల నుంచి 5 లక్షల వరకు ఖర్చు అవుతోందన్నది అంచనా. ఇది మధ్య తరగతి వర్గానికి ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. కాబట్టి ఆరోగ్య బీమాతో పాటు ప్రసూతి యాడాన్ తీసుకోవటం ఉత్తమం.
కొన్ని పాలసీలు సాధారణ ప్రసవానికయ్యే ఛార్జీలు, ఆస్పత్రిలో ఉన్నందుకైన ఖర్చు, చట్టపరమైన గర్భస్రావం తదితరాల వాటికి కూడా బీమా అందిస్తున్నాయి. అయితే ఇవన్నీ కొన్ని నిబంధనలకు లోబడి ఉంటాయి.
బిడ్డ పుట్టిన తరవాత 90 రోజుల వరకు మందులతో సహా ఆ బిడ్డకు అయ్యే వివిధ రకాల ఖర్చులకు సైతం పాలసీలున్నాయి. మూల కణాలు(స్టెమ్ సెల్స్) దాచుకునేందుకూ పాలసీలు నేడు అందుబాటులో ఉన్నాయి.
ఎంచుకోండిలా...
మహిళల దీర్ఘకాలిక వ్యాధుల కోసమే ఉద్దేశించిన పాలసీల్లో ధరలు కూడా సాధారణంగానే ఉండటం ప్రస్తుత తరుణంలో సానుకూల అంశం. కానీ అన్ని రకాల కవరేజ్ ఇచ్చే పాలసీ ఎంచుకోవటం ఉత్తమం.
ప్రీమియం, డిడక్టబుల్స్, నగదు రహిత ట్రీట్‌మెంట్ తదితరాలను పరిగణనలోకి తీసుకొని పాలసీ తీసుకోవాలి. అప్పటికే ఉన్న వ్యాధుల కవరేజీ, వ్యాధులు బీమా పరిధిలోకి రావటానికి తీసుకునే గడువు లాంటి విషయాలను పరిశీలించాలి. మహిళలకు సంబంధించి తరచుగా వచ్చే వ్యాధుల విషయంలో బీమా వర్తింపుపై పూర్తి అవగాహన ఉండాలి.
మార్కెట్‌లో మంచి పేరు ఉన్న సంస్థల నుంచి బీమా తీసుకోవాలి. ఆయా సంస్థలకు సెటిల్‌మెంట్ నిష్పత్తి మంచి స్థాయిలో ఉండటం మరీ ముఖ్యం.
ప్రీమియాన్ని బట్టి కాకుండా అవసరాలను బట్టి పాలసీని ఎంచుకోవాలి. ఎంత మొత్తం బీమా పరిధిలోకి వస్తుందన్నది ముఖ్యమైంది. పాలసీని తీసుకొనే ముందు నిబంధనలను చదివి అర్థం చేసుకోవటం ఉత్తమం.
ఇదీ చూడండి :పీఎఫ్ ఖాతా బదిలీ ఇక సులభం