చెక్ జారీ, సురక్షితమైన చెల్లింపులు, లావాదేవీల భద్రతను పెంచేందుకు పటిష్ఠమైన విధానాలను అమలుచేస్తూ వస్తోంది భారతీయ రిజర్వు బ్యాంక్ (ఆర్‌బీఐ). దీనిలో భాగంగానే అధిక విలువ గల చెక్కుల సేఫ్టీ కోసం ఈ ఏడాది జనవరిలో పాజిటివ్ పే వ్యవస్థను తీసుకొచ్చింది. ఈ విధానంలో రూ.50వేలు, అంతకంటే ఎక్కువ విలువైన చెక్కు లావాదేవీలను మరింత సురక్షితంగా నిర్వహించేందుకు చెక్ వివరాలను రీ-కన్ఫర్మేషన్ చేయాలని సూచించింది. ఈ ప్రక్రియలో చెక్కు జారీ చేసిన వారు చెక్ నంబరు, చెక్ తేదీ, చెల్లింపుదారుడి పేరు, ఖాతా నంబరు, అమౌంట్ తదితర వివరాలను సంబంధిత బ్యాంకు అధికారులకు ఎలక్ట్రానిక్ పద్ధతిలో తెలియజేసి నిర్ధరించుకోవాల్సి ఉంటుంది.
అయితే ఇప్పుడు చెక్ జారీ చేసిన తర్వాత వివరాలను బ్యాంకుతో మరోసారి నిర్ధరించుకోవడం మాత్రమే కాదు.. ఇతరులకు చెక్ జారీ చేసే ముందు కూడా మరింత జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. ఈ మేరకు బ్యాంకింగ్ నియమాల్లో ఆర్‌బీఐ కొన్ని మార్పులు చేసింది. ఈ కొత్త రూల్స్ ఆగస్టు 1 నుంచి అమల్లోకి వచ్చాయి. ఇందులో భాగంగా బల్క్ క్లియరింగ్‌ను 24 గంటలూ అందుబాటులో ఉంచాలని ఆర్‌బీఐ నిర్ణయించింది. నేషనల్ ఆటోమేటెడ్ క్లియరింగ్ హౌస్ (NACH-నాచ్) ఈ నెల నుంచి 24 గంటలూ పనిచేస్తుంది.
ఈ నిర్ణయంతో నాచ్ సేవలు వారంలోని అన్ని రోజులూ అందుబాటులో ఉంటాయి. దీంతో పనిచేయని రోజులు (నాన్-వర్కింగ్ డేస్), సెలవు దినాల్లో కూడా చెక్ క్లియరింగ్‌కు వెళ్లి క్యాష్ చేసుకునే వీలుంటుంది. కాబట్టి చెక్ ద్వారా చెల్లింపులు చేసే వారు మరింత జాగ్రత్తగా ఉండాలి. సెలవు కదా అని చెక్ క్లియరింగ్‌కు వెళ్లదని భావించి సరిపడా బ్యాలెన్స్ లేకపోయినా చెక్ ఇవ్వకూడదు. చెక్ ఇచ్చే ముందు తగినంత బ్యాలెన్స్ ఉందో లేదో చూసుకుని ఇవ్వడం ముఖ్యం. లేదంటే చెక్ బౌన్స్ అయ్యే అవకాశం ఉంది. ఒకవేళ చెక్ బౌన్స్ అయితే పెనాల్టీ చెల్లించాల్సి వస్తుంది.
ఏమిటీ నాచ్..?
నాచ్ అనేది బల్క్ పేమెంట్ సిస్టమ్. దీన్ని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పీసీఐ) నిర్వహిస్తుంది. డివిడెండ్, వడ్డీ, జీతం, పెన్షన్ వంటి క్రెడిట్ బదిలీలను ఒకరి నుంచి అనేక మందికి ట్రాన్స్‌ఫర్ చేయడాన్ని సులభతరం చేస్తుంది. అదే విధంగా పేమెంట్స్‌ను సేకరిస్తుంది. విద్యుత్, గ్యాస్, టెలిఫోన్, వాటర్ బిల్లులు, రుణాలకు సంబంధించి క్రమానుగత వాయిదాలు, మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడులు, బీమా ప్రీమియంలు మొదలైనవి సులభంగా సేకరించే సౌకర్యాన్ని కల్పిస్తుంది.
ఇవీ చదవండి: