బంగారం కొనుగోలు అంటే ఒకప్పుడు భౌతికంగా కొనుగోలు చేయటం మాత్రమే ఉండేది. ఇప్పుడు పరిస్థితి మారింది. డిజిటల్‌గా బంగారం కొనుగోలు చేసేందుకు పలు రకాల సదుపాయాలు ఉన్నాయి. గోల్డ్ ఈటీఎఫ్‌లు, ఎస్‌జీబీలు ఈ కోవలోకే వస్తాయి. ఇటీవలి కాలంలో ఇలా డిజిటల్ రూపంలో గోల్డ్ కొనుగోళ్లకు డిమాండ్ పెరుగుతోంది. 2020-21లో 46 టన్నుల గోల్డ్‌ను ఇలా కొనుగోలు చేశారంటే అర్థం చేసుకోవచ్చు వీటి డిమాండ్ ఎంతలా ఉందో. భవిష్యత్‌లోనూ ఈ డిమాండ్ కొనసాగుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఉత్తమ పెట్టుబడి మార్గాలు..
ఈటీఎఫ్ అంటే ఎక్ఛేంజీ ట్రేడెడ్ ఫండ్. అదే బంగారం ఆధారంగా ఉంటే అది గోల్డ్ ఈటీఎఫ్. ఎస్‌జీబీ అంటే గోల్డ్ సావరిన్ బాండ్లు. వీటిని ప్రభుత్వం తరఫున ఆర్బీఐ జారీ చేస్తుంది. తరుగు వంటి సమస్యలు లేకుండా సురక్షితంగా, సులభంగా పెట్టుబడి పెట్టేందుకు వీలున్నందున.. పసిడిపై పెట్టుబడి పెట్టాలనుకునే వారికి ఈ రెండూ ఉత్తమమైన మార్గాలని నిపుణులు చెబుతుంటారు.
ఎస్‌జీబీ ఆర్బీఐ ద్వారా 2020-21లో రూ.16,049 కోట్ల నిధులను సమీకరించింది. అంటే 32.4 టన్నులకు సమానమైన ఎస్‌జీబీలను పెట్టుబడిదారులు కొనుగోలు చేశారు. తదుపరి ఎస్‌జీబీలు రాబోయే ఆర్థిక సంవత్సరంలో సబ్ స్క్రిప్షన్కు అందుబాటులో ఉండనున్నాయి.
ఈటీఎఫ్‌లలో పెట్టుబడితో ప్రయోజనాలు...
ఈ ఈటీఎఫ్‌లను ఖచ్చితమైన ధరలకు కొనుగోలు చేయొచ్చు. అదనపు ఛార్జీలు ఉండవు. గోల్డ్ ఈటీఎఫ్‌లలో తక్కువ డబ్బుతో పెట్టుబడి పెట్టే అవకాశం ఉంటుంది. మనకు కావాల్సినప్పుడు వీటిని అమ్మి డబ్బులు పొందవచ్చు. అంతేకాకుండా భౌతికంగా బంగారానికి కావాల్సిన లాకర్ లాంటివి దీనికి అవసరం లేదు.
సాధారణంగా స్టాక్ మార్కెట్లలో లాభాలపై లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్, షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ఉంటాయి. ఇవి గోల్డ్ ఈటీఎఫ్‌లకు కూడా వర్తిస్తాయి.
పెరిగిన పెట్టుబడులు..
గోల్డ్ ఈటీఎఫ్‌లతో కలిపి.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు 46 టన్నుల మేర పేపర్ బంగారం (బాండ్లు, ఎక్ఛేంజ్ రూపంలో) కొనుగోళ్లు జరిగాయి. భౌతికంగా కూడా పెట్టుబడులు భారీగానే వచ్చినట్ల గణాంకాలు చెబుతున్నాయి.
2020-21 మొత్తం మీద 135 టన్నుల బంగారంపై పెట్టుబడులు జరిగాయనేది ఓ అంచనా. 2020 ఏప్రిల్ నుంచి డిసెంబర్ నాటికి భౌతికంగా 102 టన్నుల బంగారం కొనుగోళ్లు జరిగాయి.
ఈటీఎఫ్‌లలోకి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఫిబ్రవరి నాటికి రూ.6,062 కోట్ల మేర(12.9 టన్నులు) పెట్టుబడులు వచ్చాయి. బంగారం ఈటీఎఫ్‌ల్లోకి పెట్టుబడుల రాక పెరగటం వరుసగా ఇదీ రెండో ఆర్థిక సంవత్సరం. పూర్తి ఆర్థిక సంవత్సరానికి మొత్తం మీద 14 టన్నుల మేర పెట్టుబడులు గోల్డ్ ఈటీఎఫ్‌ల్లోకి వస్తాయని అంచనా.
2.5 శాతం రాబడి..
దేశీయంగా బంగారంపై పొదుపును మళ్లించేందుకు ఎస్‌జీబీలను 2015లో ప్రవేశపెట్టారు. ఇది భౌతిక బంగారం కొనుగోలుకు మంచి ప్రత్యామ్నాయమని నిపుణులు చెబుతుంటారు. వీటి ద్వారా భౌతికంగా బంగారం దాచిపెట్టుకోవటం వల్ల ఉన్న ప్రమాదాన్ని నివారించుకోవచ్చు. వార్షికంగా 2.5 శాతం రాబడి అర్జించవచ్చు. వడ్డీని ఆరు నెలలకు ఒక సారి బ్యాంక్ ఖాతాల ద్వారా చెల్లిస్తారు. భౌతికంగా నగల్లో ఉండే మేకింగ్ ఛార్జీలు, స్వచ్ఛత, తరుగు లాంటి ఇబ్బంది వీటిలో ఉండదు.
ఈ బాండ్లకు ఎనిమిది సంవత్సరాల మెచ్యూరిటీ పీరియడ్ ఉంటుంది. ఐదు సంవత్సరాల అనంతరం పెట్టుబడిని ఉపసంహరించుకునే(ఎగ్జిట్ ఆప్షన్) అవకాశం ఉంటుంది. పెట్టుబడి వెనక్కి తీసుకోవటం లేదా మెచ్యూరిటీ పీరియడ్‌లో ఉన్న బంగారం ధరకు ప్రకారమే అప్పటి ధర నిర్ణీతమౌతుంది.
కరోనా వల్ల పెరిగిన ప్రాధాన్యత...
కరోనాతో వల్ల బంగారం ప్రాధాన్యం అందరికీ తెలిసిందని, కొవిడ్ వల్ల భౌతిక బంగారం కంటే పేపర్ బంగారానికే ప్రాధాన్యత ఇచ్చారని నిపుణులు అంటున్నారు.
మార్చిలో ఎస్‌జీబీల కొనుగోళ్లు 3.23 టన్నుల మేర నమోదయ్యాయి. గతేడాది అగస్టు ఎస్‌జీబీ ఇష్యూలో 6.35 టన్నుల బంగారం బాండ్లను ఆర్బీఐ జారీ చేసింది. ఆ తర్వాత అత్యధిక కొనుగోళ్లు ఈ నెలలోనే (మార్చి 1-5) నమోదయ్యాయి.
ఇదీ చదవండి:బీఎండబ్లూ 220ఐ రిలీజ్- ట్రయంఫ్ 660 విడుదలకు రెడీ