Ipo listing 2021 India: ఈ ఏడాది పబ్లిక్ ఇష్యూ(ఐపీఓ)లు రికార్డు సృష్టించాయి. ఎన్నడూ లేనంతగా నిధులను సమీకరించాయి. ఇప్పటిదాకా 63 కంపెనీలు మార్కెట్లోకి వచ్చి, రూ.1,18,704 కోట్లను సమీకరించడం విశేషం. 2020లో మొత్తం 15 ఇష్యూల ద్వారా కంపెనీలు సమీకరించిన రూ.26,613 కోట్లతో పోలిస్తే ఈ మొత్తం నాలుగున్నర రెట్లు ఎక్కువ. ఇంతకుముందు చూస్తే ఐపీఓల ద్వారా 2017లో సమీకరించిన రూ.68,827 కోట్లే అధికంగా ఉండేదని ప్రైమ్ డేటా బేస్ గ్రూప్ వివరించింది.
మదుపర్ల ఆసక్తి..
లిస్టింగ్ రోజున భారీ లాభాలు వస్తుండటంతో, అధికులు దరఖాస్తు చేశారు. అందువల్లే ఈ ఏడాది ఐపీఓలు వరుస కట్టాయి. మొత్తం మీద పబ్లిక్ ఈక్విటీ రూపంలో ఈ ఏడాది సమీకరించిన నిధుల మొత్తం రూ.2 లక్షల కోట్లను మించింది. ఇందులో 51 శాతం (రూ.1,03,621 కోట్లు) తాజా మూలధన సమీకరణ కాగా.. మిగతా రూ.98,388 కోట్లు ఆఫర్ ఫర్ సేల్(ఓఎఫ్‌ఎస్) ద్వారా కూడబెట్టినవి. 2020లో ఇలా నమోదైన మొత్తం రూ.1,76,914 కోట్లు.
పేటీఎమ్‌దే అగ్రాసనం
ఈ ఏడాది ఇంతవరకు వచ్చిన ఐపీఓల్లో ఒన్97 కమ్యూనికేషన్(పేటీఎమ్) పెద్దది. ఇది రూ.18,300 కోట్లను సమీకరించింది. ఆ తర్వాతి స్థానంలో ఉన్న జొమోటో రూ.9,300 కోట్లను ఆకర్షించింది. ఈ ఏడాది ఇష్యూల సగటు పరిమాణం రూ.1,884 కోట్లుగా నమోదైంది.
చిన్న మదుపర్లకు 20 శాతమే..
Ipos listing 2021: ఈ ఏడాది రిటైల్ మదుపర్ల నుంచి అమితాసక్తి కనిపించింది. ఒక్కో ఇష్యూకు సగటున 14.36 లక్షల దరఖాస్తులు వచ్చాయి. 2020లో 12.77 లక్షలు; 2019లో అందిన 4.05 లక్షల దరఖాస్తులతో పోలిస్తే ఇవి చాలా ఎక్కువ. గ్లెన్‌మార్క్ లైఫ్ సైన్సెస్ (33.95 లక్షలు), దేవయాని ఇంటర్నేషనల్ (32.67 లక్షలు), లేటెంట్ వ్యూ (31.87 లక్షలు) అత్యధిక సంఖ్యలో చిన్న మదుపర్ల నుంచి దరఖాస్తులను పొందగలిగాయి.
ఇవి అధిక లాభాలిచ్చాయ్..
మొత్తం 58 ఇష్యూల్లో 34 కంపెనీలు 10 శాతానికి పైగా లాభాలను అందించాయి. సిగాచీ ఇండస్ట్రీస్ ఏకంగా 270% లాభాలు పంచింది. ఆ తర్వాత ఎక్కువ లాభాలిచ్చిన వాటిలో పరాస్ డిఫెన్స్(185%), లేటెంట్ వ్యూ(148%) ఉన్నాయి. ఆసక్తికర అంశం ఏమిటంటే. 40 సంస్థల షేర్లు ఈనెల 22 నాటికి ఇష్యూ ధర కంటే ఎగువనే చలిస్తున్నాయి.
వరుసలో ఇంకా ఉన్నాయ్..
ఈ ఏడాదిలో సెబీ వద్ద 115 కంపెనీలు ఐపీఓ కోసం దరఖాస్తు చేసుకున్నాయి. అంతక్రితం రెండేళ్లలో కలిపి 50 మాత్రమే ముందుకొచ్చాయి. ప్రస్తుతం సెబీ అనుమతులు పొందిన 35 కంపెనీలు రూ.50,000 కోట్ల మేర నిధులను సమీకరించడానికి సిద్ధంగా ఉండగా.. మరో 33 కంపెనీలు సెబీ ఆమోదం తెలిపితే రూ.60,000 కోట్లను సమీకరించడానికి సంసిద్ధమవుతున్నాయి. ఇందులో ఎల్‌ఐసీఐపీఓను కలపలేదు.
ఇదీ చూడండి:- 2022లో ఐపీఓల జాతర.. రూ.2 లక్షల కోట్ల సమీకరణ లక్ష్యం!