ఈ ఏడాది తొలి త్రైమాసికంలో పసిడికి డిమాండు భారీగా పెరిగింది. భారత్లో జనవరి-మార్చి మధ్య కాలంలో రూ. 47,010 కోట్ల విలువున్న 159 టన్నుల పుత్తడి విక్రయమైంది. ఇందులో ఆభరణాల వాటా 125.4 టన్నులు కాగా... పెట్టుబడుల వాటా 33.6 టన్నులు.
గతేడాది ఇదే సమయంతో పోలిస్తే డిమాండ్ 5 శాతం పెరిగింది. 2018 మొదటి మూడు నెలల కాలంలో రూ.41,680 కోట్ల విలువున్న 151.5 టన్నులు బంగారం అమ్ముడుపోయింది.
సానుకూలతలే వృద్ధికి కారణం
రూపాయి బలపడటం, పసిడి ధరల్లో తగ్గుదల కారణంగా నగల అమ్మకాలు భారీగా పెరిగినట్లు వరల్డ్ గోల్డ్ కౌన్సిల్(డబ్ల్యూజీసీ) తెలిపింది.
ఈ ఏడాది మొదటి 3 నెలల్లో భారత్లో పెళ్లిళ్ల సీజన్ ఈ అమ్మకాలకు ఊతమిచ్చినట్లు డబ్ల్యూజీసీ ఇండియా మేనేజింగ్ డైరెక్డర్ సోమసుందరం తెలిపారు. రానున్న రోజుల్లోనూ బంగారం ధరలు ఆకర్షణీయంగా ఉండొచ్చని అన్నారు.
డిమాండుకు తగ్గట్లే దిగుమతులు
డిమాండుకు తగినట్లే బంగారం దిగుమతులు కూడా భారీగా పెరిగాయి. ఈ ఏడాది మొదటి 3 నెలల్లో 175 టన్నుల పసిడి దిగుమతైంది. 2018తో పోలిస్తే ఇది 11 శాతం అధికం. గతేడాది ఇదే సమయంలో 157 టన్నుల బంగారం మాత్రమే దిగుమతైంది.
ప్రపంచ డిమాండ్లలోనూ వృద్ధి
2019 జనవరి-మార్చి మధ్య ప్రపంచవ్యాప్తంగా పసిడి డిమాండు 1,053.33 టన్నులకు చేరినట్లు డబ్ల్యూజీసీ నివేదికలో వెల్లడించింది. క్రితం ఏడాది ఇదే సమయంలో పోలిస్తే ఇది 7 శాతం అధికం. 2018 మొదటి 3 నెలల్లో 984.2 టన్నుల పసిడి విక్రయాలు జరిగాయి.