దేశంలో తయారీ రంగం కార్యకలాపాలు జులైలోనూ తగ్గాయి. లాక్డౌన్ ప్రభావం, ఉద్యోగాల కోతతో నెలకొన్న సిబ్బంది కొరత, డిమాండ్ ఇంకా స్తబ్దుగానే ఉండటం వల్ల తయారీ రంగంలో క్షీణత కొనసాగుతున్నట్లు ఐహెచ్ఎస్ మార్కిట్ నెలవారీ సర్వేలో వెల్లడించింది.
ఈ సర్వే ప్రకారం జులైలో పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ (పీఎంఐ) జులైలో 46గా నమోదైంది. జూన్‌లో ఇది 47.2 గా ఉండటం గమనార్హం.
పీఎంఐ తగ్గటం వరుసగా ఇది నాలుగోసారి. లాక్డౌన్ కారణంగా తొలుత ఏప్రిల్‌లో పీఎంఐ క్షీణత మొదలైంది. దాదాపు 32 నెలల వృద్ధి తర్వాత ఈ పరిణామం చోటు చేసుకోవడం గమనార్హం. ఏప్రిల్‌కు ముందు పీఎంఐ 50కి పైగా ఉంది.
కరోనా వ్యాప్తి నేపథ్యంలో దేశవ్యాప్తంగా మార్చి చివరి వారంలో లాక్డౌన్ విధించింది కేంద్రం. ఈ కారణంగా తయారీ రంగ కార్యకలాపాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. అన్‌లాక్ ప్రక్రియ ప్రారంభమైనా.. డిమాండ్ ఇంకా పుంజుకోకపోవడం, ఎగుమతులు అంతంత మాత్రంగానే ఉండటం వల్ల తయారీ రంగం ఇంకా ఒడుదొడుకులు ఎదుర్కొంటున్నట్లు నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఇదీ చూడండి:ఈ- కామర్స్‌లో ఇష్టారాజ్యానికిక చెల్లుచీటీ